చైతూ 'వృషకర్మ'.. అసలు రిలీజ్ ప్లాన్ ఇదేనా?
విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటంతో ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 9 July 2026 6:03 PM ISTతండేల్ విజయంతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు తన కెరీర్ లో మరో భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. దర్శకుడు కార్తీక్ దండుతో తెరకెక్కిస్తున్న మిథికల్ థ్రిల్లర్ వృషకర్మపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే ఆ సినిమాపై ఆసక్తి పెరగగా, ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో విడుదలపై చర్చలు మొదలయ్యాయి.
ఇటీవల రాజస్థాన్ లో జరిగిన కీలక షెడ్యూల్ కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. రాజభవనాలు, పురాతన కట్టడాల మధ్య షూట్ చేసిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకమైన విజువల్ ట్రీట్ ఉండబోతుందనే సిగ్నల్స్ ఇచ్చాయి. కథలో కీలకమైన భాగాన్ని అక్కడే షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉండగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, సీజీఐ పనులపై మూవీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మిస్టికల్ కథకు తగ్గట్టుగా కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. ఆ చిత్రంలో నాగ చైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.
విరూపాక్షతో బ్లాక్ బస్టర్ అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండటంతో ఆ ప్రాజెక్టుపై ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే సినిమా గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఎదురుచూస్తున్న విషయం మాత్రం రిలీజ్ డేట్. ఇప్పటివరకు మూవీ టీమ్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించలేదు. దీంతో ఎప్పుడు విడుదల అవుతుందనే అంశంపై రకరకాల ప్రచారం జరుగుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, వృషకర్మను 2026లో విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే తేదీ ప్రకటించడంలో మేకర్స్ తొందరపడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఏడాదిలో పలు భారీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, వాటి మధ్య పోటీ లేకుండా సరైన సమయాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వినికిడి. ముఖ్యంగా సోలో రిలీజ్ డేట్ దొరికే వరకు వేచి చూసే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. పెద్ద సినిమాలతో పోటీ పడకుండా, సినిమాకు ఎక్కువగా థియేటర్లు లభించేలా తేదీని ఖరారు చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.
అందుకే షూటింగ్ దాదాపు పూర్తవుతున్నా రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయడం లేదని టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వృషకర్మ విషయంలో మూవీ టీమ్ తొందరపడకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ ను ముగించి, అనుకూలమైన సోలో రిలీజ్ డేట్ ను ఎంచుకుని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో నాగ చైతన్య అభిమానులు ఇప్పుడు సినిమా విడుదల తేదీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
