ఓటీటీ మార్కెట్ స్లో అయినా.. చైతూకి ఎందుకింత డిమాండ్?
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు భారీ మొత్తాలు వెచ్చించిన డిజిటల్ సంస్థలు ఇప్పుడు మాత్రం ఎంపిక చేసిన ప్రాజెక్టులకే పెద్ద మొత్తాలు కేటాయిస్తున్నాయి.
By: M Prashanth | 16 July 2026 7:00 PM ISTటాలీవుడ్ లో గత కొంతకాలంగా ఓటీటీ మార్కెట్ జోరు తగ్గిందనే చర్చ సాగుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు భారీ మొత్తాలు వెచ్చించిన డిజిటల్ సంస్థలు ఇప్పుడు మాత్రం ఎంపిక చేసిన ప్రాజెక్టులకే పెద్ద మొత్తాలు కేటాయిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న వృషకర్మ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే భారీ డిజిటల్, శాటిలైట్ డీల్ జరిగిందనే ప్రచారం వినిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ స్లోగా ఉన్నా చైతూకి ఎందుకింత డిమాండ్ ఏర్పడిందనే చర్చ మొదలైంది. ఇటీవల నాగ చైతన్య కెరీర్ లో కీలక మలుపుగా నిలిచిన చిత్రం తండేల్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా చైతన్య మార్కెట్ ను కూడా పెంచిందని చెప్పాలి.
చాలా కాలంగా ఒక పెద్ద కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూసిన చైతూ, తండేల్ తో ఆ లోటును కవర్ చేశారు. ఆ సక్సెస్ ఎఫెక్ట్ ఇప్పుడు ఆయన కొత్త సినిమా వృషకర్మపై కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వృషకర్మ సాధారణ కమర్షియల్ సినిమా కాదు. మిస్టరీ, అడ్వెంచర్, పురాణ అంశాలు, నిధుల అన్వేషణ వంటి అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగ చైతన్యను కొత్త కోణంలో చూపించబోతోంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో ట్రెజర్ హంటర్ పాత్రలో చైతూ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతంలో చేయని రోల్ లో కనిపించబోతుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దర్శకుడు కార్తీక్ దండు పేరు కూడా ఆ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. విరూపాక్ష వంటి విజయం తర్వాత ఆయన రూపొందిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు డిజిటల్ సంస్థల్లోనూ నమ్మకం పెరిగినట్లు తెలుస్తోంది.
ఓటీటీ సంస్థలు ఇప్పుడు కేవలం స్టార్ ఇమేజ్ ను మాత్రమే చూడడం లేదు. థియేటర్ల తర్వాత కూడా ఎక్కువకాలం వీక్షకులను ఆకర్షించే కంటెంట్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆ కోణంలో చూస్తే వృషకర్మలో ఉన్న మిస్టరీ, ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలు డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో చైతన్య సినిమా కోసం ముందుగానే భారీ పెట్టుబడి పెట్టడానికి ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపినట్లు సమాచారం.
అలాగే నాగ చైతన్యకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓటీటీ ద్వారా ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో ఆయన సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో కూడా మంచి ఆదరణ పొందినట్లు తెలుస్తోంది. ఆ ఆంశం కూడా వృషకర్మ డీల్ కు కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. అలా ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ నెమ్మదించినా, ట్రాక్ రికార్డ్, పెరుగుతున్న మార్కెట్, కొత్త తరహా కథలు ఎంపిక చేసుకోవడం, దర్శకుడిపై ఉన్న నమ్మకం వంటి అంశాలు నాగ చైతన్యకు డిమాండ్ తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే వృషకర్మ విడుదలకు ముందే ఇండస్ట్రీలో ఇంతటి చర్చకు కారణమవుతోందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
