భార్యను ఒక్క మాటలో వర్ణించమంటే చై ఏమన్నారంటే?
నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళపై ప్రేమను మరోసారి చాటుకున్నారు. ఓ కార్యక్రమంలో శోభితను ఒక్క మాటలో వర్ణించమని అడగ్గా ‘ప్రేమ’ అని సమాధానమిచ్చారు. ఆమెలోని చురుకుదనం, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. ప్రస్తుతం చైతన్య ‘వృషకర్మ’ సినిమాలో నటిస్తున్నారు.
By: Srikanth Kontham | 23 Nov 2026 1:40 PM ISTసెలబ్రిటీల వ్యక్తిగత బంధాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అందులోనూ తమ అభిమాన హీరో జీవిత భాగస్వామి గురించి ఎలాంటి మాటలు చెబుతారో? వినాలని అందరికీ ఉంటుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న యవ సామ్రాట్ నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ గురించి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకే ఒక్క మాటలో శోభితను వర్ణించమని అడిగినప్పుడు చై ఇచ్చిన సమాధానం అభిమానుల మనసులను హత్తుకుంటోంది.
రాపిడ్ ఫైర్ రౌండ్‌లో శోభితను ఒక్క మాటలో చెప్పమనగానే నాగచైతన్య ఏమాత్రం ఆలోచించకుండా ప్రేమ అని బదులిచ్చారు. శోభిత గురించి తలచుకోగానే తనకు ముందుగా గుర్తొచ్చే భావన అదేనని స్పష్టం చేశారు. అంతకుముందు అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ శోభితలో తనకు ఎన్నో మంచి గుణాలు నచ్చుతాయని.. ముఖ్యంగా ఆమెలో చురుకైన.. డైనమిక్ స్వభావం ఎంతగానో ఆకట్టుకుంటుందన్నారు.
భారతీయ సంప్రదాయం.,. ఆధునిక భావాల కలయికగా శోభిత ఉంటారని చైతన్య ప్రశంసించారు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. ఊహించని పరిస్థితులను ఎదుర్కొనే తీరు తనకు ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. తాను ప్రయాణాలకు వెళ్లినప్పుడు ముందుగానే పక్కా ప్రణాళిక వేసుకుంటానని.. ఏదైనా ప్లాన్ తారుమారైతే కొంత తికమక పడతానన్నారు. కానీ శోభిత మాత్రం వెంటనే పరిస్థితిని చక్కదిద్దుకుని ముందుకు తీసుకెళ్తుందని గుర్తు చేసుకున్నారు.
శోభితతో కలిసి ప్రయాణించడం వల్ల తాను కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం.. కొత్త విషయాలను నేర్చుకోవడం అలవాటు చేసుకున్నానని చైతన్య తెలిపారు. శోభితలో ఆ ఆసక్తి.. ఉత్సాహం తన ఆలోచనా విధానంలోనూ మార్పు తెచ్చాయని ఆ గుణాలే తనకు శోభితలో బాగా నచ్చుతాయని మనసు విప్పి చెప్పారు. రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న నాగచైతన్య.. శోభిత ధూళిపాళ 2024 డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తమ వ్యక్తిగత జీవితాన్ని.. వృత్తిపరమైన పనులను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో `వృషకర్మ` చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా తర్వాత చైతన్య తదుపరి ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా విజయం చైతన్యకు కీకలం. గత సినిమాతో `తండేల్` తో 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో `వృషకర్మ` విజయంతో ఆ రేంజ్ రెండింతలు అవ్వాలని ఆశీస్తున్నారు. సినిమా సక్సెస్ ను బట్టి తదుపరి నిర్ణయం జరుగుతుందని తెలుస్తుంది.
