Begin typing your search above and press return to search.

వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..

నాగ చైతన్య నటిస్తున్న 'వృషకర్మ' ట్రైలర్ విడుదలైంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మిస్టరీ, సూపర్ నేచురల్ అంశాలు, భారీ విజువల్స్ ఆకట్టుకున్నాయి. సినిమా కోసం కార్తీక్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని చైతు ప్రశంసిస్తూ, ఈ చిత్రానికి దర్శకుడే మొదటి హీరో అని అన్నారు. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుంది.

By:  M Prashanth   |   26 Nov 2026 9:23 AM IST
వృషకర్మపై చైతు కాన్ఫిడెన్స్.. ఆ మాటే హైలెట్..
X

నాగ చైతన్య కెరీర్‌లో ఇప్పటివరకు చేయని కథతో వృషకర్మ రాబోతోంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను నెల్లూరులో విడుదల చేశారు. మిస్టరీ, సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ విజువల్స్ ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. అయితే ఈవెంట్‌లో చైతు సినిమా కంటే ఎక్కువగా దర్శకుడు కార్తీక్ గురించి మాట్లాడటం విశేషం. తెలుగు సినిమా గర్వపడే స్థాయిలో వృషకర్మ ఉంటుందని నమ్మకంగా చెప్పారు.

ట్రైలర్ విషయానికొస్తే ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ఓ రహస్య శక్తి చుట్టూ కథను నడిపించారు. మొదట ట్రెజర్ హంటర్‌గా కనిపించిన నాగ చైతన్య, తర్వాత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనే పాత్రలో కనిపిస్తున్నారు. వేద విజ్ఞానం, పురాతన గుర్తులు, అతీంద్రియ శక్తులతో కథను ముడిపెట్టారు. చివర్లో వృషకర్మగా చైతు కనిపించే సన్నివేశం ఆకట్టుకుంది. మీనాక్షి చౌదరి, కియారా ఖన్నా, జయరామ్ పాత్రలను కూడా హైలెట్ చేశారు. విలన్‌గా స్పర్ష్ శ్రీవాస్తవ భయపెట్టే లుక్‌లో కనిపించగా, సత్య కామెడీ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంది.

ఇక నాగ చైతన్య మాట్లాడుతూ కార్తీక్ కథ చెప్పినప్పుడు దానికి ఎలాంటి రిఫరెన్స్ దొరకలేదని, అంత కొత్తగా రాసుకున్నారని ప్రశంసించారు. దాదాపు 2 గంటల 50 నిమిషాల సినిమాలో ప్రతి ఫ్రేమ్‌లో ఏదో ఒక వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి విజన్‌తో వచ్చిన కార్తీకే ఈ సినిమాకు మొదటి హీరో అని అన్నారు. తెలుగు దర్శకులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారని, ఆ జాబితాలో కార్తీక్ కూడా చేరుతారని నమ్మకం వ్యక్తం చేశారు.

స్పర్ష్ శ్రీవాస్తవ పాత్ర గురించి కూడా చైతు ప్రత్యేకంగా మాట్లాడారు. సినిమా విడుదలయ్యాక అందరూ ఆ క్యారెక్టర్ గురించే మాట్లాడుకుంటారని చెప్పారు. మీనాక్షి డెడికేషన్‌ను మెచ్చుకున్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ధైర్యంగా ముందుకెళ్లారని తెలిపారు. ఇక మీనాక్షి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎన్నో కొత్త విషయాలను రూపొందించామని చెప్పారు. స్పర్ష్ తనకు తెలుగు ప్రేక్షకులతో పాటు చైతుతో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని తెలిపారు.

టెక్నికల్‌గా కూడా వృషకర్మకు భారీ స్కేల్ కనిపిస్తోంది. శ్రీ నాగేంద్ర తంగాల రూపొందించిన గుహల సెట్స్, రాగుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ క్లిక్కయ్యేలా ఉన్నాయి . అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మిస్టరీ సన్నివేశాలకు బాగా సెట్ అయింది. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. విరూపాక్షతో హారర్, మిస్టరీ కథను బాగా డీల్ చేసిన కార్తీక్ ఈసారి పురాతన రహస్యాలతో మరింత పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు.

ఇక నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ఇరవై ఏళ్ల క్రితం నెల్లూరులో ఛత్రపతి షూటింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా తరహాలో వృషకర్మ కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న వృషకర్మ థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్‌తో ప్రమోషన్స్‌కు మరింత ఊపు తీసుకొచ్చిన టీమ్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.