Begin typing your search above and press return to search.

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

నాగచైతన్య ‘వృషకర్మ’ సినిమా కోసం భారీ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యారు. ట్రెజర్ హంటర్ అర్జున్ పాత్ర కోసం నెలల తరబడి జిమ్‌లో శిక్షణ తీసుకుని కండలు పెంచారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 25న ట్రైలర్ విడుదల చేయనుండగా, డిసెంబర్ 4న సినిమా థియేటర్లలోకి రానుంది.

By:  M Prashanth   |   23 Nov 2026 4:33 PM IST
చైతూ బీస్ట్ మోడ్.. వృషకర్మ కోసం ఇంతలా!
X

లవ్ స్టోరీల్లో సాఫ్ట్‌గా కనిపించిన నాగచైతన్య ఇప్పుడు తన ఇమేజ్‌ను పూర్తిగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. 'తండేల్'లో రఫ్ గెటప్‌తో కనిపించిన చైతూ, 'వృషకర్మ' కోసం ఇంకాస్త డోస్ పెంచాడు. బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ జిమ్ ఫొటో చూస్తే ఆ మార్పు ఏ లెవెల్లో ఉందో అర్థమవుతుంది. ఇప్పటివరకు చైతూను చూసిన లుక్‌కు, ఈ ఫొటోలో కనిపిస్తున్న ఫిజిక్‌కు చాలానే తేడా ఉంది.

షర్ట్ లేకుండా వెనక్కి తిరిగి రెండు చేతులు పైకెత్తిన చైతూ ఫొటోలో బ్యాక్ మజిల్స్, భుజాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంతకుముందు చైతూ నుంచి ఇలాంటి కండలు కనిపించే లుక్ చాలా అరుదు. నిజానికి ఈ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంబంధించిన జిమ్ ఫొటోలు మార్చిలోనే బయటకొచ్చాయి. ఇప్పుడు బర్త్‌డే సందర్భంగా మళ్లీ షేర్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ కొత్త ఫిజిక్ కోసం చైతూ నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్నారు.

'వృషకర్మ'లో చైతూ అర్జున్ అనే ట్రెజర్ హంటర్‌గా కనిపించనున్నారు. పురాణాల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో యాక్షన్ సీన్స్‌కు కూడా మంచి స్కోప్ ఉంది. అలాంటి క్యారెక్టర్‌కు బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ రెండూ సరిపోవాలనే ఉద్దేశంతో చైతూ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నట్లు గతంలో హింట్ ఇచ్చారు. సినిమాలోని యాక్షన్ ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో గ్లింప్స్‌లో కొంత చూపించారు.

మరోవైపు దర్శకుడు కార్తీక్ దండు 'విరూపాక్ష'తో మంచి హిట్ అందుకున్నారు. ఆ సినిమాలో సస్పెన్స్, మిస్టరీని నమ్ముకున్న కార్తీక్ ఈసారి మరింత పెద్ద కథ ఎంచుకున్నారు. ఇలాంటి కథలో హీరో చేసే యాక్షన్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటివరకు రొమాంటిక్ హీరోగా ఎక్కువ గుర్తింపు ఉన్న చైతూ ఈ జానర్‌లో ఎంతవరకు సెట్ అవుతారన్న ఆసక్తి ఉంది. పైగా కథలో సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే చైతూ బర్త్‌డే సందర్భంగా 'వృషకర్మ' నుంచి మరో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అందులో పురాతన కత్తితో రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. 'స్వాగ్ ఆఫ్ అర్జున్' పాటలో హీరో స్టైల్ చూపిస్తే, 'చలో పదవే'లో చిన్నారితో అనుబంధాన్ని హైలైట్ చేశారు. దీంతో సినిమా అంతా ఫైట్స్‌తోనే నడవదని, ఎమోషనల్ ట్రాక్ కూడా ఉంటుందని అర్థమవుతోంది. ఆ పాటలో చైతూ లుక్ కూడా పూర్తిగా వేరుగా ఉంది.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జయరామ్, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుండగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 25న నెల్లూరులో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. డిసెంబర్ 4న రిలీజ్ ఖాయమని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వాయిదా పడుతుందనే ప్రచారానికి కూడా ఈ అప్‌డేట్‌తో చెక్ పెట్టారు.