Begin typing your search above and press return to search.

ఆమె లేకుండా ఉండలేను.. ల‌వ్ స్టోరీని రివీల్ చేసిన చైతూ

ఒక రోజు తాను త‌న క్లౌడ్ కిచెన్ షోయు గురించి పోస్ట్ చేస్తే శోభిత దానికి ఓ కామెంట్ చేసింద‌ని, అప్ప‌ట్నుంచే తాను శోభిత‌తో చాట్ చేయ‌డం మొద‌లుపెట్టి, ఆ త‌ర్వాత క‌లుసుకున్నామ‌ని చెప్పారు చైతూ.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 Oct 2025 3:37 PM IST
ఆమె లేకుండా ఉండలేను.. ల‌వ్ స్టోరీని రివీల్ చేసిన చైతూ
X

తండేల్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకున్న అక్కినేని నాగ చైత‌న్య రీసెంట్ గా జ‌గ‌ప‌తి బాబు హోస్ట్ చేస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా టాక్ షో కు గెస్టుగా హాజ‌ర‌య్యారు. ఆ షో లో త‌న భార్య‌, న‌టి శోభితా ధూళిపాల‌తో ఉన్న అనుబంధాన్ని, వారి ప్రేమ క‌థ గురించి మ‌రియు ప‌లు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు చైతూ.

శోభిత‌ను డిజ‌ప్పాయింట్ చేసిన తండేల్

తండేల్ సినిమాతో చైత‌న్య త‌న కెరీర్లో మొద‌టి రూ.100 కోట్ల సినిమాను అందుకున్నారు. ఆ సినిమా స‌క్సెస్ తో చైత‌న్య ఎంతో ఆనందంగా ఉండ‌గా, త‌న భార్య శోభిత మాత్రం ఆ సినిమా విష‌యంలో చాలా తీవ్రంగా నిరాశ చెందార‌ని చైతూ వెల్ల‌డించారు. తండేల్ మూవీ షూటింగ్ కోసం గడ్డం పెంచుకొని చాల రోజులు ఉండటం పెళ్లి కి కూడా గడ్డం ఉంచుకోవడం పెళ్లి తరువాత షూటింగ్ కంప్లీట్ ఐయ్యే వరకు గడ్డం ఉంచుకోవడం శోభిత కి నచ్చలేదు అనుకుంట.

గొడ‌వ‌లుంటేనే ప్రేమ బ‌ల‌ప‌డుతుంది

తాను శోభితాను బుజ్జితల్లి అని పిలుస్తాన‌ని, అలాంటి పేరుతో తండేల్ లో సాంగ్ ఉండ‌టం వ‌ల్ల ఆమె అలిగింద‌ని, పైగా తానే స్వ‌యంగా డైరెక్ట‌ర్ తో సినిమాలో ఆ పేరు పెట్ట‌మ‌ని అడిగాన‌ని శోభిత అనుకుంద‌ని, కానీ తానెందుకు అలా చేస్తానని చెప్పారు చైతూ. ఈ కార‌ణంతోనే శోభిత త‌న‌తో కొన్నాళ్ల పాటూ మాట్లాడ‌లేద‌ని, అయినా జంటల మ‌ధ్య త‌గాదాలు లేకుండా ఉంటే అది నిజ‌మైన రిలేష‌న్ కాద‌ని, చిన్న చిన్న గొడ‌వ‌లుంటేనే ప్రేమ మ‌రింత స్ట్రాంగ్ అవుతుంద‌ని చైతూ అభిప్రాయ‌ప‌డ్డారు.

శోభితాతో ప్రేమ అలా మొద‌లైంది

అయితే పెళ్లికి ముందు వీరిద్ద‌రూ ప్రేమించుకున్న‌ప్ప‌టికీ, వారి గురించి ఎన్ని వార్త‌లొచ్చినా ఇద్ద‌రూ మౌనం వ‌హిస్తూనే వ‌చ్చారు. త‌మ ల‌వ్ స్టోరీ గురించి చెప్తూ, తమ ప‌రిచ‌యం ఇన్‌స్టాగ్ర‌మ్ లో మొద‌లైంద‌ని, త‌న పార్ట‌న‌ర్ ను ఆన్ లైన్ లో క‌లుస్తాన‌ని ఎప్పుడూ అనుకోలేద‌ని చెప్పిన చైతూ, ఒక రోజు తాను త‌న క్లౌడ్ కిచెన్ షోయు గురించి పోస్ట్ చేస్తే శోభిత దానికి ఓ కామెంట్ చేసింద‌ని, అప్ప‌ట్నుంచే తాను శోభిత‌తో చాట్ చేయ‌డం మొద‌లుపెట్టి, ఆ త‌ర్వాత క‌లుసుకున్నామ‌ని చెప్పారు చైతూ.

భార్య లేకుండా ఉండలేను

ఇక షో లాస్ట్ లో జ‌గ‌ప‌తి బాబు, చైతూని ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో మీ లైఫ్ లో ఏం లేకుండా ఉండ‌లేర‌ని అడ‌గ్గా, దానికి చైత‌న్య క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా త‌న భార్య శోభిత లేకుండా ఉండ‌లేన‌ని చెప్పారు. ప్ర‌స్తుతం తాను జీవిస్తున్న లైఫ్ విష‌యంలో చాలా సంతోషంగా ఉన్నాన‌ని, ఈ జీవితాన్ని తాను మ‌రెవ‌రితోనూ స్వాప్ చేసుకోన‌ని, ఇదే త‌న‌కు న‌చ్చిన లైఫ్ అన్నారు చైత‌న్య‌.