Begin typing your search above and press return to search.

కమర్షియల్ సినిమా.. చైతూ చెప్పిన నిజం

టాలీవుడ్ కమర్షియల్ సినిమా ఫార్ములా మారిపోయిందని హీరో నాగచైతన్య అన్నారు. పదేళ్ల క్రితం ఐదు పాటలు, మూడు ఫైట్లు లేకపోతే సినిమాను అంగీకరించేవారు కాదని, ఇప్పుడు ఎక్కువ పాటలు ఉంటే ప్రేక్షకులు లాగ్ అంటున్నారని తెలిపారు. 'వృషకర్మ'లో కథ వేగానికి అడ్డుపడే పాటలు, రొమాంటిక్ ట్రాక్‌లు లేవని, ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుందని చెప్పారు.

By:  M Prashanth   |   28 Nov 2026 10:02 PM IST
కమర్షియల్ సినిమా.. చైతూ చెప్పిన నిజం
X

టాలీవుడ్ లో కమర్షియల్ సినిమా అంటే ఒకప్పుడు పక్కా లెక్కలు ఉండేవి. హీరో ఎంట్రీకి ఒక ఫైట్, మధ్యలో రెండు డ్యూయెట్లు, ఒక ఐటెం సాంగ్, క్లైమాక్స్ లో మరో భారీ ఫైట్ ఉంటేనే అది కమర్షియల్ మూవీ అనే ముద్ర పడేది. కథతో సంబంధం లేకపోయినా వీటిని బలవంతంగా ఇరికించేవారు. కానీ ఇప్పుడు ఆ పాత గ్రామర్ పూర్తిగా మారిపోయిందని హీరో నాగచైతన్య చెప్పిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

'వృషకర్మ' మీడియా మీట్ లో మాట్లాడిన చైతన్య, పదేళ్ల క్రితం వరకు ఐదు పాటలు, మూడు ఫైట్లు లేకపోతే దాన్ని అసలు సినిమాగానే ఒప్పుకునేవారు కాదని గుర్తుచేశారు. కానీ ఇవాళ పరిస్థితి రివర్స్ అయిందని, సినిమాలో ఐదు పాటలు పెడితే ఆడియన్స్ వెంటనే లాగ్ అంటున్నారని చెప్పారు. కథను అనవసరంగా ఎందుకు డ్రాగ్ చేస్తున్నారని ప్రేక్షకులు సూటిగా ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు.

చైతన్య చెప్పిన ఈ మార్పు వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. ఓటీటీలు, డబ్బింగ్ సినిమాలు అందుబాటులోకి వచ్చాక తెలుగు ఆడియన్స్ కు వరల్డ్ సినిమా మీద భారీ ఎక్స్ పోజర్ వచ్చింది. తక్కువ నిడివితో, గ్రిప్పింగ్ గా కథ చెప్పే విధానం వాళ్లకు బాగా అలవాటైంది. ఇలాంటి టైమ్ లో కథకు సంబంధం లేకుండా పాటలు లేదా బలవంతపు ఫైట్ సెట్ పీస్ లు ఇరికిస్తే, సినిమా టెంపో దెబ్బతిని ప్రేక్షకులు బోర్ ఫీలవుతున్నారు.

నిజానికి ఈ ట్రెండ్ ను అర్థం చేసుకునే టాలీవుడ్ మేకర్స్ కూడా రూట్ మార్చుతున్నారు. ఈ మధ్య వచ్చిన పలు క్రైమ్ థ్రిల్లర్లు, మిడ్ రేంజ్ సినిమాల్లో పాటల సంఖ్య బాగా తగ్గిపోయింది. కొన్ని పెద్ద సినిమాల్లో అయితే పాటలను కేవలం బ్యాక్ గ్రౌండ్ మాంటేజ్ లాగానో లేదా ఎండ్ కార్డ్స్ లోనో వాడుతున్నారు. నాగచైతన్య కూడా తన పాత లవ్ స్టోరీల టెంప్లేట్ పక్కన పెట్టి, 'దూత' వెబ్ సిరీస్ తో అసలు పాటలే లేని థ్రిల్లర్ చేసి సక్సెస్ అందుకున్నారు.

ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న 'వృషకర్మ' విషయంలోనూ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. కథ వేగానికి అడ్డుపడుతుందని రొమాంటిక్ ట్రాక్స్, అనవసరపు పాటల జోలికి అసలు వెళ్లలేదని ఈ టీమ్ ముందే క్లారిటీ ఇచ్చింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

ఏదేమైనా కమర్షియల్ సినిమా అంటే ఐదు పాటలు, మూడు ఫైట్లు అనే రోజులు ఎప్పుడో వెళ్లిపోయాయి. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెట్టి, ఎక్కడా ఫోన్ వైపు చూడనివ్వకుండా థ్రిల్ ఇచ్చే కంటెంటే అసలైన కమర్షియల్ సక్సెస్ అని చైతన్య మాటలతో మరోసారి తేలిపోయింది. మరి కొత్త పంథాలో వస్తున్న 'వృషకర్మ' బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.