అది నాకు దక్కిన అదృష్టం : నాగ చైతన్య
ముఖ్యంగా ఇప్పటి వరకు బయటకు రాని చాలా వ్యక్తిగత విషయాలను గురించి నాగ చైతన్య ఓపెన్‌గా జగపతిబాబు ముందు మాట్లాడేశాడు.
By: Ramesh Palla | 6 Oct 2025 7:00 PM ISTతండేల్ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నాగ చైతన్య ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా గురించిన విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తండేల్‌ను మించిన సినిమా అవుతుందని, తండేల్ కంటే డబుల్ వసూళ్లు సాధిస్తుంది అంటూ ఆ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాదిలో విడుదల కాబోతున్న ఆ సినిమా గురించి ఇప్పుడే ఏమీ మాట్లాడలేను అంటూ అఖిల్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ సినిమా గురించి కాదు కానీ, తన జీవితంలో జరిగిన పలు ఆసక్తికర విషయాల గురించి, చిన్నప్పటి విషయాల గురించి, ఫ్యామిలీ గురించి చాలా విషయాలను నాగ చైతన్య తాజాగా ఒక టాక్ షో లో పంచుకున్నారు. ఆ సమయంలోనే మహానటి సినిమాలో తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు పాత్రను చేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా..
జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న జగపతిబాబు యొక్క జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో లో ఈ వారం అక్కినేని నాగ చైతన్య గెస్ట్‌గా హాజరు అయ్యాడు. ఈ షో లో ఆయన పలు ఆసక్తికర విషయాలను జగపతిబాబుతో షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు బయటకు రాని చాలా వ్యక్తిగత విషయాలను గురించి నాగ చైతన్య ఓపెన్‌గా జగపతిబాబు ముందు మాట్లాడేశాడు. తన సినిమా కెరీర్ విషయంలోనూ నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తన వైవాహిక జీవితం, స్నేహితుల గురించి ఇంకా పలు విషయాల గురించి నాగ చైతన్యతో జగపతిబాబు మాట్లాడించడంతో ప్రస్తుతం ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా మహానటి గురించి నాగ చైతన్య మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మహానటిలో నాగ చైతన్య పాత్ర..
మహానటి గురించి నాగ చైతన్య మాట్లాడుతూ.... దర్శకుడు నాగ్ అశ్విన్ నా వద్దకు వచ్చి మహానటి సినిమాలో తాతగారి పాత్ర చేయాలని ప్రపోజల్ పెట్టాడు. ఆ సమయంలో నేను చాలా భయ పడ్డాను. తాత గారి పాత్రలో నటించడం అంత ఈజీ కాదనే విషయం తెలుసు. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఆందోళన ఉండేది. అందుకే సినిమాను తప్పించుకోవడంకు చాలా ప్రయత్నాలు చేశాను. నేను చేయలేను అని చెప్పడం మాత్రమే కాకుండా, నా వద్దకు ఆ ప్రపోజల్‌తో రావద్దని చెప్పాను. అయినా కూడా నాగ్ అశ్విన్ వదిలి పెట్టలేదు. దాంతో అప్పుడు నేను చేస్తున్న సవ్యసాచి సినిమా కోసం గడ్డం పెంచుతున్నాను. ఇప్పట్లో గడ్డం తీసే అవకాశం లేదు. కనుక తాత గారి పాత్రలో నేను చేయడం కుదరదు.. ఆ సినిమాలో నేను నటించడం సాధ్యం కాదు అని చెప్పడంతో నాగ్ అశ్విన్ ఆ సమయంలో వెళ్లి పోయాడు.
అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నాగ చైతన్య
కొన్నాళ్ల తర్వాత మళ్లీ నాగ్ అశ్విన్ నా వద్దకు వచ్చి గడ్డం అడ్డం కాదు, గడ్డం తీయకుండానే నటించేయి అన్నాడు. అదేలా అంటే నేను వీఎఫ్‌ఎక్స్ లో గడ్డం తీసేయిస్తాను అన్నాడు. గడ్డంను వీఎఫ్‌ఎక్స్‌లో తీయించి మరీ నాతో యాక్టింగ్ చేయించాడు అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. సినిమాలో నటించిన తర్వాత అనిపించింది.. ఆ సమయంలో నేను సినిమాను చేయకుండా ఉండి ఉంటే, ఆ పాత్రను మరెవ్వరైనా చేసేవారు, దాన్ని నేను ఖచ్చితంగా అంగీకరించే వాడిని కాదు. కానీ నేను తాత గారి పాత్రలో నటించడం వల్ల నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఆయన పాత్రలో నటించడం అనేది నాకు దక్కిన అదృష్టంగా ఆ తర్వాత భావించాను. నేను ఆ పాత్రను చేయకుంటే ఖచ్చితంగా చాలా బాధపడే వాడిని... తాతగారి పాత్రను చేస్తే ఎలాంటి కామెంట్స్ వస్తాయో అని అనుకున్నాను. ఎవరు ఏం అనుకున్నా తాతగారి పాత్రను చేయాలని అనుకుని మహానటిలో నటించాను అన్నాడు.
