Begin typing your search above and press return to search.

'వృషకర్మ'.. అసలు గేమ్ స్టార్ట్ చేసిన జోడీ

చైతూ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే 'వృషకర్మ' కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. పైగా ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు.

By:  M Prashanth   |   31 Oct 2026 11:04 AM IST
వృషకర్మ.. అసలు గేమ్ స్టార్ట్ చేసిన జోడీ
X

ఒక సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాక, దాని గురించి ప్రేక్షకులకు చెప్పడానికి నెల రోజులే మిగిలితే మామూలు ప్రమోషన్లు సరిపోవు. బాక్సాఫీస్ వద్ద సినిమా క్లిక్ కావాలి అంటే ప్రమోషన్ గేమ్ లో తప్పకుండా క్లిక్కవ్వల్సిందే. ఇక నాగచైతన్య 'వృషకర్మ' టీమ్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది. ఇంతకాలం పోస్టర్లు, చిన్న అప్‌డేట్స్‌కే పరిమితమైన చిత్రబృందం ఒక్కసారిగా బయటకు వచ్చింది. లేటెస్ట్ గా చైతూ, మీనాక్షి చౌదరి కలిసి ప్రమోషన్లకు హాజరయ్యారు. ఇద్దరూ ట్రెడిషనల్ దుస్తుల్లో కెమెరాల ముందు కనిపించారు. కానీ ఈసారి వాళ్లు చేస్తున్న ప్రచారంలో ఓ ప్రత్యేకత కనిపిస్తోంది.

సినిమా భారీగా తీశామని చెప్పే బదులు, షూటింగ్ జరిగిన ప్రదేశాన్నే మీడియాకు చూపిస్తున్నారు. ఇటీవల విలేకరులను 'వృషకర్మ' సెట్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ యాభై రోజులు కష్టపడి నిర్మించిన బ్రహ్మగిరి గుహను పరిచయం చేశారు. మూడు భాగాలుగా ఉన్న ఈ సెట్‌లో కీలక సన్నివేశాలు తీశారు. ఇందులో చిత్రీకరణ ఎలా జరిగిందో మీడియాకు వివరించారు. గ్రాఫిక్స్‌తో సరిపెట్టకుండా నిజంగా గుహ నిర్మించడం వెనుక ఎంత పని జరిగిందో చూపించే ప్రయత్నమిది.

చైతూ ఇప్పటివరకు చేసిన సినిమాలతో పోలిస్తే 'వృషకర్మ' కోసం భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. పైగా ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. పురాణాల నేపథ్యం, రహస్యాలు, సాహసాలతో కూడిన సినిమా. ప్రేక్షకులకు కథ ఏ తరహాలో ఉండబోతోందో అర్థమయ్యేలా చేయడానికి ఒక్క పోస్టర్ సరిపోదు. అందుకే విడుదలకు ముందే ఈ భారీ మేకింగ్‌ను చూపించడం మొదలుపెట్టారు.

'తండేల్'లో మత్స్యకారుడిగా కనిపించిన చైతూ, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రలోకి వెళ్లారు. మరోవైపు 'విరూపాక్ష'తో మంచి విజయం అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు 'విరూపాక్ష' తర్వాత ఇది రెండో సినిమా. గత సినిమాలో భయాన్ని, రహస్యాన్ని బాగా ఉపయోగించుకున్న దర్శకుడు ఈసారి మరింత పెద్ద కథను ఎంచుకున్నారు. ఇద్దరికీ ఈ సినిమా కెరీర్‌లో కొత్త తరహా ప్రయత్నం కావడంతో ప్రేక్షకుల అంచనాలు కూడా మారాయి.

నిర్మాతల వైపు నుంచి కూడా పెద్ద ప్లానింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక థియేట్రికల్ హక్కులను దిల్ రాజు సంస్థ తీసుకుంది. సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర కలిసి సినిమాను నిర్మిస్తున్నాయి. డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా జీ సంస్థ తీసుకుంది. భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నప్పుడు ప్రమోషన్లు చివరి వారానికి వదిలేయడం కష్టం. అందుకే నవంబర్ అంతా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు టీమ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఇక కథలో చైతూ, మీనాక్షితో పాటు మరికొన్ని ముఖ్యమైన పాత్రలు హైలెట్ కానున్నాయి. మీనాక్షి పురావస్తు పరిశోధకురాలిగా, జయరామ్ ప్రొఫెసర్ రంగనాథ్‌గా కనిపించనున్నారు. 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. 'విరూపాక్ష'కు పనిచేసిన అజనీష్ లోక్‌నాథ్ మరోసారి కార్తీక్‌తో కలిశాడు. ఇక సినిమాలోని పాత్రలను ఒక్కొక్కటిగా ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 4న సినిమా విడుదల కానుండగా, అంతకుముందు వచ్చే ట్రైలర్‌తో ఈ మిస్టరీ కథపై మరింత క్లారిటీ రానుంది.