నాగచైతన్య వ్యక్తిత్వంపై అమల అక్కినేని ప్రశంసలు
చైతూ చాలా సౌమ్యుడు. చైతన్య తల్లి చెన్నైలో ఉండేవారు. అందువల్ల అతడు చెన్నైలో పెరిగాడు. కాలేజ్ చదువుల కోసం హైదరాబాద్ కి వచ్చినప్పటి నుంచి అతడు నాకు బాగా తెలిసొచ్చాడు.
By: Sivaji Kontham | 26 Nov 2025 10:17 PM ISTఅక్కినేని నాగ చైతన్య ఇటీవల పూర్తిగా తన కెరీర్ పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. `తండేల్` గ్రాండ్ సక్సెస్ తర్వాత అతడు కెరీర్ ని మరింత జాగ్రత్తగా నిర్మించుకునే ఆలోచనతో ఉన్నాడు. ఇప్పుడు మరో పెద్ద విజయం కోసం అతడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. చైతన్య ఎప్పుడూ నిజాయితీగా తన పని తాను చేసుకుపోయే నటుడు. అది అతడికి వరుస విజయాలను అందిస్తోంది. అంతేకాదు.. చైతన్య ఎలాంటి వాడు? అంటే.. ఎంతో పరిణతితో బాధ్యతగా వ్యవహరించే యువకుడు అంటూ కితాబిచ్చారు అక్కినేని అమల. చైతన్యను బాల్యం నుంచి తాను దగ్గరగా చూసిన విషయాలను ఎన్డీటీవీ పాడ్ కాస్ట్ లో వెల్లడించారు.
చైతూ చాలా సౌమ్యుడు. చైతన్య తల్లి చెన్నైలో ఉండేవారు. అందువల్ల అతడు చెన్నైలో పెరిగాడు. కాలేజ్ చదువుల కోసం హైదరాబాద్ కి వచ్చినప్పటి నుంచి అతడు నాకు బాగా తెలిసొచ్చాడు. అంతకుముందు పరిచయం ఉన్నా, ఇక్కడికి వచ్చాకే నాకు చైతన్య బాగా ఆర్థమయ్యాడని అమల అక్కినేని అన్నారు.
చైతన్య మంచి మనసున్న అందమైన యువకుడు. మానవతావాది. వయస్సుకు మించిన పరిణతి, జ్ఞానం అతడికి ఉంది. చైతన్య చాలా బాధ్యతగా ఉంటాడు. ఎప్పుడూ తప్పులు చేయని, ఎల్లప్పుడూ తన తండ్రి మాట వినే వ్యక్తి. కానీ సొంత ప్రణాళిక, ఆలోచనలు కలిగి ఉన్న తెలివైనవాడు అని అమల అక్కినేని ప్రశంసించారు.
అమల తన కుమారుడు అఖిల్ పెంపకం గురించి ఇదే పాడ్ కాస్ట్‌లో మాట్లాడారు. నా వారసుడు అఖిల్ పై నేను చాలా ప్రభావం చూపానని అమల అన్నారు. తమ ఇద్దరు పిల్లల పెంపకం విలువల గురించి కూడా అమల అక్కినేని మాట్లాడుతూ.. మా ఇద్దరు అబ్బాయిలను చాలా స్వతంత్రులుగా పెంచామని అన్నారు. ``పరిస్థితిని విశ్లేషించడం, సొంత నిర్ణయాలు తీసుకోవడం, సొంత ఎంపికలు చేసుకోవడం వారికి తెలుసు. పరిణామాలతో సంబంధం లేకుండా ఎలా ముందుకు సాగాలో నేర్పించాము. కొన్నిసార్లు కొన్ని బాగా జరుగుతాయి.. కొన్నిసార్లు జరగవు.. కానీ మీరు అలా నేర్చుకుంటారు`` అని భోధించినట్టు అమల చెప్పారు.
