Begin typing your search above and press return to search.

అక్కినేని ఫ్యాన్స్‌కి మరో వంద కోట్ల మూవీ...!

అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న వంద కోట్ల సినిమాను నాగ చైతన్య తీసుకు వచ్చాడు.

By:  saisumeeth   |   12 April 2025 4:46 PM IST
అక్కినేని ఫ్యాన్స్‌కి మరో వంద కోట్ల మూవీ...!
X

అక్కినేని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న వంద కోట్ల సినిమాను నాగ చైతన్య తీసుకు వచ్చాడు. ఈ ఏడాది ఆరంభంలోనే నాగ చైతన్య 'తండేల్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుని రూ.100 కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్నాడు. విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో సినిమా లీక్ అయింది. అలా జరగకుండా ఉంటే కచ్చితంగా సినిమాకు మరింత భారీగా వసూళ్లు నమోదు అయ్యేవి. అక్కినేని ఫ్యాన్స్ కాలర్‌ ఎగురవేసుకునే రేంజ్‌లో తండేల్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా తండేల్‌ సినిమాలో నాగ చైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. తండేల్‌ సినిమా తర్వాత చైతూ చేయబోతున్న సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పటికే నాగ చైతన్య తదుపరి సినిమా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతోంది. 'విరూపాక్ష' సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకున్న కార్తీక్‌ వర్మ దండు ప్రస్తుతం నాగ చైతన్య కోసం విభిన్నమైన కమర్షియల్‌ థ్రిల్లర్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడట. చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపు ఆరు నెలలుగా సాగుతోంది. తండేల్‌ సినిమా విడుదల అయ్యి, మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ వర్మ మరింత బాధ్యతతో, సీరియస్‌గా స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా స్క్రిప్ట్‌ ఉంటుందని తెలుస్తోంది.

కార్తీక్‌ వర్మ దండు పై నమ్మకంతో నాగ చైతన్య తన ఫిజిక్‌ను భారీగా మార్చుకుంటున్నాడని తెలుస్తోంది. దాంతో సినిమాలో చైతూ విభిన్నంగా కనిపించబోతున్నాడు. ఈమధ్య కాలంలో నాగ చైతన్య తండేల్‌ కోసం జుట్టు, గడ్డం బాగా పెంచిన విషయం తెల్సిందే. కార్తీక్‌ వర్మ దండు సినిమా కోసం పూర్తి వైవిధ్యభరిత లుక్‌లో కనిపిస్తాడని, అందుకోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రకటన రావడంతో పాటు, ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ముగించి షూటింగ్‌ను సైతం మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తుంది.

తండేల్‌ సినిమా తర్వాత నాగ చైతన్య సినిమా అనగానే మినిమం అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్‌ అయితే కచ్చితంగా వంద కోట్ల క్లబ్‌లో మరోసారి నాగ చైతన్య కు చోటు దక్కడం ఖాయం. పైగా కార్తీక్‌ వర్మ దండు గత చిత్రం విరూపాక్ష భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా నాగ చైతన్యకు అది కూడా కలిసి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నారు. అన్ని పాజిటివ్‌ వైబ్స్ ఉన్న కారణంగా సినిమాకు కచ్చితంగా వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయనిపిస్తుంది. అక్కినేని ఫ్యాన్స్ కి నాగ చైతన్య బ్యాక్ టు బ్యాక్‌ వంద కోట్ల సినిమాలను అందించడం కన్ఫర్మ్‌ అనే మీడియా సర్కిల్స్‌లోనూ చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. థ్రిల్లర్‌, హర్రర్‌ కాన్సెప్ట్‌ ఈమధ్య సక్సెస్‌లను దక్కించుకుంటున్నాయి. కనుక నాగ చైతన్యకు అది కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.