టాలెంటెడ్ ప్రొడ్యూసర్ తో లెజండరీ డైరెక్టర్ మూవీ
అయితే నాగ్ అశ్విన్ ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తారనే విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 17 Nov 2025 7:00 PM ISTటాలీవుడ్ లో తన స్టైల్, విభిన్న కథలతో కొత్త దృక్పథాన్ని చూపించిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంత టాలెంటెడ్ అనేది అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో నాగి కూడా ఒకరు. ఎవడే సుబ్రహ్మణ్యంతో డైరెక్టర్ గా పరిచయమైన నాగ్ అశ్విన్, మహానటి మూవీతో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.
జాతిరత్నాలుతో నిర్మాతగా సూపర్ హిట్
గతేడాది ప్రభాస్ తో కల్కి మూవీ చేసి ఆ సినిమాతో ఓ కొత్త ప్రయోగం చేసి అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేసిన నాగి, ప్రస్తుతం కల్కి2 పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే నాగ్ అశ్విన్ ఓ వైపు సినిమాలు తీస్తూనే మరోవైపు సినిమాలు నిర్మిస్తారనే విషయం తెలిసిందే. ఆల్రెడీ అతని నిర్మాణంలో జాతి రత్నాలు అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలవగా, ఇప్పుడు నాగి మరోసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.
మహానటి, కల్కి కోసం సింగీతంతో వర్క్ చేసిన నాగి
ఆయన మరెవరో కాదు, సింగీతం శ్రీనివాసరావు. డైరెక్టర్ గా సింగీతం చేయని ప్రయోగాలు లేవు, ఆయన టచ్ చేయని జానర్ లేదు. ఎంతోమందికి ఆయన డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టం. ఆయన డైరెక్షన్ ను ఇష్టపడే వారిలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. సింగీతం అంటే నాగికి ప్రత్యేక అభిమానం. ఆయనతో కలిసి నాగి.. మహానటి, కల్కి సినిమాలకు కూడా వర్క్ చేశారు.
అలాంటి సింగీతం దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నాగి ఎప్పట్నుంచో అనుకుంటుండగా, ఇన్నాళ్లకు ఆ ప్రాజెక్టు ముందుకెళ్తుందని తెలుస్తోంది. ఈ మూవీ పూర్తిగా సింగీతం మార్క్ లోనే ఉంటుందని, ఇందులో అంతా కొత్తవాళ్లే నటించనున్నారని, ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని సమాచారం. సింగీతం లాంటి డైరెక్టర్ కు నాగ్ అశ్విన్ లాంటి అభిరుచి ఉన్న నిర్మాత తోడైతే అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు గురించి టాలీవుడ్ లో చాలా పెద్ద డిస్కషనే నడుస్తోంది.
