Begin typing your search above and press return to search.

కల్కి శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది!

భారతీయ పురాణాల్లోని అన్వేషించని అంశాలను సైన్స్ ఫిక్షన్ కోణంలో తెరపైకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉందనే విషయాన్ని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.

By:  Srikanth Kontham   |   25 Sept 2026 6:00 PM IST
కల్కి శాంపిల్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది!
X

నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్ర విజయంపై ..భారతీయ పురాణాలలో దాగి ఉన్న సైన్స్ ఫిక్షన్ సామర్థ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `కల్కి 2898 ఏడీ’`చిత్రం ఆరంభం మాత్రమేనని.. భారతీయ పురాణాలలో అపరి మితమైన సైన్స్ ఫిక్షన్ కాన్సెప్టులు , వైవిధ్యమైన ముల్లోకాల గురించిన ఆలోచనలు దాగి ఉన్నాయని ఆయన పే ర్కొన్నారు. `క‌ల్కి 2898 ఏడీ` సాధించిన ఘనవిజయం, పురాణాలను ఆధారంగా చేసుకుని సైన్స్ ఫిక్షన్ చిత్రాలను తెరకెక్కించవచ్చనే నమ్మకాన్ని చిత్ర పరిశ్రమకు అందించిందని తెలిపారు. భారతీయ పురాణాల్లోని అన్వేషించని అంశాలను సైన్స్ ఫిక్షన్ కోణంలో తెరపైకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉందనే విషయాన్ని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.

`కల్కి 2898 ఏడీ` సాధించిన విజయం సృజనాత్మకంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించవచ్చని నిరూపించిందన్నారు. ఈ విజయం ఫలితంగా రాబోయే రోజుల్లో నటీనటులు, నిర్మాతలు ఇలాంటి సరికొత్త కాన్సెప్ట్‌లతో కూడిన చిత్రాలకు ఆమోదం తెలపడానికి ధైర్యంగా ముందుకొస్తార‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే చిత్రం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ప్రొడక్షన్ డిజైన్ విభాగానికి జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం పట్ల నాగ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశారు. విదేశీ చిత్రాలు లేదా ఇప్పటికే ఉన్న సైన్స్ ఫిక్షన్ డిజైన్లను అనుకరించకుండా భారతీయ సంస్కృతి , మూలాలతో కూడినఒక ప్రత్యేకమైన హైబ్రిడ్ ప్రపంచాన్ని సృష్టించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించారు. తమ బృందం పడిన కష్టానికి, చూపిన సృజనాత్మకతకు తగిన గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని తెలిపారు.

ఈ చిత్రం విష్ణువు చివరి అవతారమైన కల్కి కథాంశంతో సాగుతుంది. క్రీస్తు శకం 2898 నాటి కాశీ నగరం నేపధ్యంలో ఒక డిస్టోపియన్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ కల్కి సినీమాటిక్ యూనివర్స్ కు ఈ సినిమా తొలి మెట్టుగా నిలిచింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, శోభన , దిశా పటానీ వంటి అగ్ర శ్రేణి నటీనటులు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ప్ర‌స్తుతం క‌ల్కి 2 సెట్స్ లో ఉంది. క‌ల్కి 2898 ఏడికి కంటున్యూటీగా రెండ‌వ భాగం ఉంటుంది. సినిమాలో అస‌లైన ప‌వ‌ర్ పుల్ పాత్ర‌లు రెండో భాగంలో క‌నిపించ‌నున్నాయి.

మొదటి భాగంలో భైరవుడు, అశ్వత్థామల మధ్య ఘర్షణను, కాశీ డిస్టోపియన్ ప్రపంచాన్ని పరిచయం చేసిన నాగ్ అశ్విన్ `కల్కి 2`లో యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ పూర్తిస్థాయి విలనిజంతో పాటు కల్కి అవతారానికి సంబంధించిన అసలు డ్రామాను మరింత పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించబోతున్నారు. తొలి భాగంలో మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు, పాత్రల గతానికి సంబంధించిన ఆసక్తికర సమాధానాలు సీక్వెల్‌లోనే ల‌భిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటిచెప్పే దిశగా రూపొందుతున్న‌ చిత్రం కల్కి సినీమాటిక్ యూనివర్స్ ను మరో విజువల్ వండర్‌గా మార్చబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు.