Begin typing your search above and press return to search.

అదేం పెద్ద విషయం కాదు... కల్కి డైరెక్టర్ క్లారిటీ

కానీ నాగ్‌ అశ్విన్ ఆయనపై ఉన్న అభిమానంతో ప్రయోగాత్మక సినిమాను నిర్మించి తన అభిమానంను చాటుకున్నాడు.

By:  Ramesh Palla   |   12 Jun 2026 1:43 PM IST
అదేం పెద్ద విషయం కాదు... కల్కి డైరెక్టర్ క్లారిటీ
X

చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ దర్శకుడిగా ఆకాశమే హద్దు అన్న రేంజ్‌లో క్రేజ్‌ను దక్కించుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. మొదటి సినిమా ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తన మార్క్‌ను చూపించి, మహానటితో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించిన నాగ్‌ అశ్విన్‌, 'కల్కి' సినిమాతో ఏకంగా హాలీవుడ్‌ రేంజ్‌కు చేరిన విషయం తెల్సిందే. వరుస సినిమాలు చేయాలని కాకుండా, మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో నాగ్‌ అశ్విన్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన తనకు ఇష్టమైన దర్శకుడు సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించాడు. ఆయనతో సినిమా అంటే నిర్మాతలు ఇప్పుడు అంత రిస్క్‌ అవసరమా అనుకుంటారు. కానీ నాగ్‌ అశ్విన్ ఆయనపై ఉన్న అభిమానంతో ప్రయోగాత్మక సినిమాను నిర్మించి తన అభిమానంను చాటుకున్నాడు.

సింగ్‌ గీతం సినిమా ప్రీ రిలీజ్‌...

సింగీతంపై ఉన్న అభిమానంను ఇలా చూపించుకున్నాను అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఒక వీడియోతో వైరల్ అయిన విషయం తెల్సిందే. సింగీతం శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందిన 'సింగ్‌ గీతం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగ్‌ అశ్విన్‌ కింద కూర్చున్న వీడియోలు అందరి దృష్టిని ఆకర్షించాయి. పైగా చెప్పులు విడిచి మరీ నాగ్‌ అశ్విన్ కింద కూర్చోవడంతో ఎంత గౌరవం అంటూ నాగ్‌ అశ్విన్ గురించి అంతా కూడా ప్రముఖంగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. సింగీతంతో పాటు, ఇతర గెస్ట్‌లు మాట్లాడుతున్న సమయంలో చిన్నపిల్లాడి మాదిరిగా నాగ్‌ అశ్విన్‌ కింద కూర్చుని వారి మాటలు వినడం కనిపించింది. నాగ్‌ అశ్విన్‌ స్వామి భక్తి అంటూ కొందరు, ఆయనకు పెద్దలపై ఉన్న గౌరవం అంటూ పలువురు కామెంట్స్ చేశారు. ఆయన మామగారు అయిన ప్రముఖ అశ్వినీదత్‌ సైతం ఈ విషయం గురించి స్పందించారు.

నాగ్‌ అశ్విన్‌ వ్యాఖ్యలు...

చెప్పులు విప్పి కూర్చున్న విషయం గురించి నాగ్‌ అశ్విన్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు సింగీతం గారు అంటే అభిమానం, ఆయన మాట్లాడుతూ ఉంటే శ్రద్ధగా వినాలనే ఉద్దేశంతో కింద కూర్చున్నాను, కింద కూర్చున్న సమయంలో చెప్పులు ఉంటే కంఫర్ట్‌గా అనిపించదు. అందుకే ఆ సమయంలో చెప్పులు విప్పాను. అంతకు మించి ఏం లేదు. అదో పెద్ద విషయం అనుకోలేదు. దాన్ని గురించి ఇంత చర్చ అనవసరం అన్నట్లుగా నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంకు సింపుల్‌ కామెంట్‌తో తేల్చి పారేశాడు. నాగ్‌ అశ్విన్‌ సింప్లిసిటీకి ఇది నిదర్శనం అంటూ ఆయన గురించి సోషల్‌ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఇంత సింపుల్‌ జీవితాన్ని సాగించడం అంటే మామూలు విషయం కాదు, అది కేవలం నాగ్‌ అశ్విన్‌కే సాధ్యం అంటారు.

కల్కి 2 సినిమా అప్‌డేట్‌..

వెయ్యి కోట్ల సినిమా తీసినా కూడా నాగ్‌ అశ్విన్ సింపుల్‌గానే ఉంటాడు. ఆయన ఒక చిన్న కారులోనే ప్రయాణించడం కూడా గతంలో వైరల్‌ అయ్యింది. ఇప్పుడు కొత్తగా కింద కూర్చోవడం కూడా వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కాకుండా గతంలోనూ ఆయన గురించి చాలా వీడియోలు, ఫోటోలు వైరల్‌ అయ్యాయి. సినిమాలతో పాటు, ఇలాంటి విషయాల కారనంగా నాగ్‌ అశ్విన్‌ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇక నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన సింగ్‌ గీతం సినిమాకు ప్రేక్షకుల్లో పాజిటివ్‌ బజ్‌ కనిపించింది. మరి నేడు విడుదలైన సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనేది చూడాలి. బడ్జెట్‌ లెక్కలు వేసుకోకుండా ఈ సినిమాను నిర్మించినట్లుగా నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. మరో వైపు నాగ్‌ అశ్విన్‌ ఎప్పుడు కల్కి 2 సినిమాను చేస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.