ఈ నటి రోల్స్ రాయిస్ తొలి భారతీయ యజమాని
ఈ నటి ఇరాక్ లో జన్మించింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రంలో నటించడమే గాక బాలీవుడ్ అగ్ర నాయికగా ఏలింది.
By: Sivaji Kontham | 1 Aug 2025 8:55 AM ISTఈ నటి ఇరాక్ లో జన్మించింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రంలో నటించడమే గాక బాలీవుడ్ అగ్ర నాయికగా ఏలింది. అంతేకాదు 60లలో తొలి రోల్స్ రాయిస్ ను కొనుగోలు చేసిన నటీమణిగా రికార్డులకెక్కింది. ఇంతకీ ఈ నటి పేరేమిటి? అంటే- నాదిరా. పదేళ్ల వయసులో సినీరంగంలో ప్రవేశించిన నాదిరా, ఆ తర్వాత ఎదిగే వయసులో తారా లోకంలో దివ్యతారగా వెలిగిపోయింది. అంతేకాదు బాలీవుడ్ లో అద్భుతమైన క్లాసిక్స్ లో నటించింది. భారతీయ సినిమా హిస్టరీలో మరపురాని నటిగా నాదిరా గొప్ప క్రేజ్ సంపాదించుకున్నారు.
నాదిరా తొలి చిత్రం 'మౌజ్' 1943లో విడుదలైంది. ఈ చిత్రం విడుదలయ్యేప్పటికి నాదిరా వయసు 10. అయితే దర్శకుడు మెహబూబ్ ఖాన్ భార్య సర్దార్ అక్తర్ ఆమెను 'ఆన్' (1952) చిత్రంలో రాజ్‌పుత్ యువరాణిగా నటించే అవకాశం కల్పించారు. ఈ పాత్రతో భారీ ఫాలోయింగ్ వచ్చింది. 1955లో `శ్రీ 420` అనే చిత్రంలోను నటించింది. దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరై (1960), పాకీజా, హన్స్ జఖ్మ్, అమర్ అక్బర్ ఆంథోనీ లాంటి క్లాసిక్ హిట్ చిత్రాల్లో నాదిరా నటించింది. 'నాదిరా' చివరిగా 2000-01లో జోష్ (2000), జోహ్రా మహల్ చిత్రాలలో నటించింది.
కళ్లతోనే కోటి భావాలు పలికించగల మేటి ప్రతిభావని నాదిరా తొలి సినిమాకు రూ.1200 జీతం అందుకున్నారు. ఆ తర్వాత 3600 వరకూ పారితోషికం పెరిగింది. ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటైన రోల్స్ రాయిస్‌ను కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ నటిగా నాదిరా రికార్డులకెక్కింది. తన కెరీర్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నాదిరా ఎదిగారు. నాదిరా రోల్స్ రాయిస్ గురించి నాటి రోజుల్లో దేశవిదేశాల్లో గొప్పగా మాట్లాడుకునే వారు.
