Begin typing your search above and press return to search.

'నాచే నాచే' కాపీనా? ఏకంగా చెప్పు చూపించి మరీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   10 Jan 2026 10:06 AM IST
నాచే నాచే కాపీనా? ఏకంగా చెప్పు చూపించి మరీ!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటించిన ది రాజా సాబ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంక్రాంతికి కానుకగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ టాక్ అందుకుంది. అయితే సినిమాలో నాచే నాచే సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. విడుదలకు ముందే మేకర్స్ సాంగ్ రుచి చూపించగా.. అప్పుడు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

1982లో మిథున్ చక్రవర్తి నటించిన బాలీవుడ్ మూవీ డిస్కో డ్యాన్సర్ లోని ఆవా ఆవా కోయి యహాన్ నాచే సాంగ్ ను దాదాపు 44 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాజా సాబ్ కోసం రీమిక్స్ చేశారు. ప్రస్తుతం ట్రెండ్ కు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేయగా.. నకాష్ అజీజ్, బృందా కలిసి పాడారు. అయితే సాంగ్ లో ప్రభాస్ తన స్వాగ్ అండ్ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా పాటలోని నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌.. ముగ్గురూ పోటాపోటీగా స్టెప్పులు వేయడమే కాదు, పొట్టి డ్రెస్సుల్లో తమ గ్లామర్ తో హీటెక్కించారు. దీంతో ముగ్గురు భామలతో కలిసి డార్లింగ్ వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. ప్రభాస్ కాస్ట్యూమ్స్, స్టైల్ చాలా కొత్తగా ఉండగా.. విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి. ఏదేమైనా సాంగ్ అందరినీ మెప్పించింది.

అదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు ఆ సాంగ్ పై కాపీ ఆరోపణలు రావడం మరో ఎత్తు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ గా మారింది. నాచే నాచే సాంగ్ కోసం తన ట్యూన్‌ ను కాపీ చేశారని స్వీడన్‌ కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్ ఆరోపించారు. అంతే కాదు.. తాను ఇప్పటికే కంపోజ్ చేసిన సాంగ్ ను, నాచే నాచేను కంపేర్ చేసి వీడియో పెట్టారు.

ఆ వీడియోలో తాను కంపోజ్ చేసిన అలమియో సాంగ్ ను తొలుత ప్లే చేసిన విడో జీన్.. ఆ తర్వాత నాచే నాచే సాంగ్ ను వినిపించారు. ఆ సమయంలో తన కాళ్లకు ఉన్న చెప్పును తీసి పైకెత్తి చూపించారు. చెప్పుతో కొట్టాలి అన్నట్లు చెప్పు కొన్ని సెకన్లపాటు అంటూ ఇటూ ఊపారు. ఆ తర్వాత ప్రభాస్ ఫోటో యాడ్ చేసి ప్రశంసలు కురిపించారు. ఆయన చాలా గొప్ప యాక్టర్ అంటూ కొనియాడారు.

సాంగ్ విషయంలో ఆయన తప్పేమి లేదని అన్నారు. దీంతో ఇప్పుడు విడో జీన్ పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారడంతో అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే పలు సాంగ్స్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న తమన్.. ఇప్పుడు నాచే నాచే మ్యాటర్ పై ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.