తారక్ ను ఎవరూ సరిగ్గా చూపించలేదా? నీల్ తోనే సాధ్యమా?
కానీ ఇప్పుడు తారక్ పొటెన్షియల్ ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూపించలేదంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రవి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 25 Nov 2025 2:04 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. భారీ డైలాగ్స్, కళ్లు చెదిరే డ్యాన్స్.. ఇలా అన్ని అంశాల్లో ఆయన రూటే వేరు. నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. సింగిల్ టేక్ లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే హీరోస్ లిస్ట్ లో తారక్ టాప్ లో ఉంటారు.
అందుకే ఆయన సినిమాలు చూసిన వారు.. తన తర్వాతే ఎవరైనా అంటూ కొనియాడుతుంటారు. అంతలా టాలెంట్ అండ్ ఎనర్జీతో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు తారక్. అనేక చిత్రాలతో ఆడియన్స్ ను, అభిమానులను తెగ మెప్పించారు. వాటిలో సింహాద్రి, యమదొంగ, ఆది సినిమాలంటే ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టం.
ఆ మూడు చిత్రాల్లో తారక్ ఎనర్జీ హై లెవెల్ లో కనిపిస్తుంటుంది. సింహాద్రి, యమదొంగలో రాజమౌళి.. ఆదిలో వినాయక్ ను ఎన్టీఆర్ ను తమ ఫ్యాన్స్ కావాలనుకునే విధంగా చూపించారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ లో కూడా జక్కన్న.. తారక్ ను చూపించిన విధానానికి అంతా ఫిదా అయ్యారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
కానీ ఇప్పుడు తారక్ పొటెన్షియల్ ను ఇప్పటి వరకు ఎవరూ సరిగ్గా చూపించలేదంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత రవి వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్.. అసలు స్టామినా.. తమ మూవీలోనే కనిపిస్తుందని అన్నారు. తారక్ హీరోగా మైత్రీ సంస్థ.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. శరవేగంగా నీల్ కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓ మీడియా మీట్ లో రవిశంకర్ యలమంచిలి.. నీల్- తారక్ మూవీ కోసం మాట్లాడారు. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా తారక్ పొటెన్షియల్ ను సరిగా చూపించలేదని తెలిపారు. థియేటర్స్ ను షేక్ చేయనున్నామని అన్నారు.
దీంతో నిర్మాత రవి కామెంట్స్ తో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఇప్పటికే రాజమౌళి, వినాయక్ సహా పలువురు డైరెక్టర్లు తారక్ ను ఓ రేంజ్ లో ప్రెజెంట్ చేయగా.. అంతకుమించి ప్రశాంత్ నీల్ చూపించనున్నారా అని అంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. భారీ ప్లాన్ వేస్తున్నారా అంటూ డిస్కస్ చేసుకుంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఏం చేయనున్నారో.. తన సినిమాలో తారక్ ను ఎలా ప్రజెంట్ చేయనున్నారో తెలియాలంటే వేచి చూడాలి.
