కార్మికులు- నిర్మాతలకు పెద్ద దిక్కు.. మెగాస్టార్‌పై మైత్రి రవి!
కొత్త దర్శకులను, చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని యలమంచిలి రవి తెలిపారు.
By: Sivaji Kontham | 22 Aug 2026 10:36 AM ISTసినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి (రవి యెర్నేని) మాట్లాడిన మాటలు అభిమానులను, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా చిరంజీవి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. బాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఎంతో సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. చిరంజీవి కేవలం వెండితెరపై నటుడిగానే కాకుండా... కోట్లాది మందికి ఆదర్శంగా నిలిచారని మైత్రి రవి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
చిరంజీవి గారి సినీ ప్రస్థానాన్ని పక్కన పెడితే...ఆయన చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అత్యంత ప్రశంసనీయమని రవి గుర్తుచేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ -ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారని... ఎన్నో ప్రాణాలను కాపాడారని తెలిపారు. అలాగే సినీ పరిశ్రమలో లేదా బయట ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా `నేను ఉన్నాను` అనే కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇచ్చే గొప్ప మనసు ఉన్న వ్యక్తి చిరంజీవి గార``ని కొనియాడారు. పరిశ్రమలో కార్మికుల నుంచి నిర్మాతల వరకు ఎవరికి కష్టం వచ్చినా నిమిషాల్లో పరిష్కరించే పెద్ద దిక్కుగా ఆయన నిలిచారన్నారు.
కొత్త దర్శకులను, చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని యలమంచిలి రవి తెలిపారు. చిన్న సినిమాలు విజయం సాధించినప్పుడు వారిని ఇంటికి పిలిచి, గంటల తరబడి సమయం కేటాయించి గిఫ్ట్‌లు ఇవ్వడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. అలాగే తాము తీసిన సినిమాలు హిట్ అయినప్పుడు స్వయంగా అప్రిసియేషన్ లెటర్లు, మెమోరబుల్ గిఫ్ట్‌లు పంపించేవారని...వాటిని తాము ఎంతో పదిలంగా దాచుకున్నామని పర్సనల్ జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్న సినిమాల ఈవెంట్లకు ఆహ్వానిస్తే.. వారికి ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా హాజరవుతారని చెప్పారు.
ఈనాటి యువతరం చిరంజీవి గారి పాత సినిమాలను ఖచ్చితంగా చూడాలని రవి సూచించారు. 1980ల నుండి 1995 వరకు ఆయన నటించిన ఖైదీ, అభిలాష, పున్నమినాగు, చట్టానికి కళ్ళు లేవు, విజేత వంటి చిత్రాలు తెలుగు సినిమా రంగాన్ని సరికొత్త మలుపు తిప్పాయని తెలిపారు. పరిశ్రమలోకి వచ్చిన మూడు నుండి ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అగ్ర నటుడిగా ఎదిగి, `ఖైదీ` చిత్రంతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా అవతరించడం సాధారణమైన విషయం కాదని.. అది చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమైందని కొనియాడారు.
భారతీయ సినీ చరిత్రలోనే చిరంజీవి గారు ఇచ్చినన్ని బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్లు మరి ఏ ఇతర నటుడు కూడా ఇవ్వలేదని రవి స్పష్టం చేశారు. చిరంజీవి సాధించిన ఈ విజయం .. స్టార్‌డమ్ మళ్లీ ఎవరూ పునరావృతం చేయలేరని అన్నారు. ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఉత్సాహంతో వచ్చే మెగా అభిమానులను చూస్తుంటే గర్వంగా ఉంటుందని తెలుపుతూ.. ఈ సందర్భంగా మాట్లాడే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.
