Begin typing your search above and press return to search.

మీకు మిగిలితేనే ఇవ్వండి.. ఆ స్టార్ హీరో మాటలకు షాక్ అయిన నిర్మాత!

స్టార్ హీరోలు నిర్మాతల పట్ల చాలా సానుకూలంగా ఉంటారని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ తాజాగా వెల్లడించారు.

By:  M Prashanth   |   28 Nov 2025 10:25 PM IST
మీకు మిగిలితేనే ఇవ్వండి.. ఆ స్టార్ హీరో మాటలకు షాక్ అయిన నిర్మాత!
X

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల పారితోషికం గురించి చాలా కథలు వింటూ ఉంటాం. సినిమా మొదలవ్వక ముందే అడ్వాన్స్ అడుగుతారని, డబ్బింగ్ చెప్పాలంటే ఫుల్ పేమెంట్ క్లియర్ చేయాలని హీరోలు పట్టుబడతారని టాక్ ఉంది. కానీ వాస్తవం వేరుగా ఉందని, స్టార్ హీరోలు నిర్మాతల పట్ల చాలా సానుకూలంగా ఉంటారని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ తాజాగా వెల్లడించారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా' సక్సెస్ మీట్ లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

నిర్మాత రవి శంకర్ మాట్లాడుతూ.. తాము సినిమా చేసిన ప్రతీ హీరో తమకు అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ.. "ఆయన అసలు సినిమా మొదలయ్యే ముందు డబ్బుల గురించే మాట్లాడరు. సినిమా రిలీజ్ అయ్యాక, మీకు లాభాలు మిగిలితేనే ఇవ్వండి, లేకపోతే వద్దు అని అంటారు" అని చెప్పారు. ఒక అగ్ర హీరో నిర్మాత గురించి ఇంతలా ఆలోచించడం నిజంగా గొప్ప విషయమని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.

ఇక ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్లు కూడా పేమెంట్స్ విషయంలో చాలా కూల్ గా ఉంటారట. "మీ దగ్గర ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి" అనే టైప్ లో వాళ్ళు ఉంటారని, అందుకే తాము అంత భారీ బడ్జెట్ సినిమాలు ధైర్యంగా తీయగలుగుతున్నామని రవి శంకర్ వివరించారు. రామ్ చరణ్, చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్ కూడా సినిమాలు రిలీజ్ అయ్యాక ఏడాది వరకు కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా వెయిట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' విషయంలో కూడా హీరో రామ్ పోతినేని చాలా సపోర్ట్ చేశారట. ఈ సినిమాకు రామ్ అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదని, దానికి బదులుగా నైజాం, గుంటూరు ఏరియా రైట్స్ ను షేర్ గా తీసుకున్నారని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ఇలా పాట్నర్షిప్ మోడల్ లోకి రావడం వల్ల సినిమా బడ్జెట్ భారం తగ్గిందని, క్వాలిటీ అవుట్ పుట్ వచ్చిందని తెలిపారు.

ఈ రోజుల్లో వడ్డీల భారం పెరిగిపోతున్న తరుణంలో, హీరోలు ఇలా ముందుకొచ్చి నిర్మాతలకు ఊపిరి పోస్తున్నారు. "మనం ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఇండస్ట్రీ బ్రతకడం ముఖ్యం" అనే ఆలోచన స్టార్ హీరోలలో పెరగడం శుభపరిణామం. దీనివల్ల నిర్మాతలు రిస్క్ తీసుకుని పెద్ద సినిమాలు తీయడానికి ధైర్యం చేస్తున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో నిర్మాతలు, హీరోల మధ్య ఉన్న ఈ ఆరోగ్యకరమైన వాతావరణమే మన ఇండస్ట్రీ సక్సెస్ కు సీక్రెట్ అని రవి శంకర్ మాటలు రుజువు చేస్తున్నాయి.