Begin typing your search above and press return to search.

ఉస్తాద్ ప్రీరిలీజ్: ప‌వ‌ర్‌స్టార్ వ్య‌క్తిత్వం నుంచి నిర్మాత‌ల స్ఫూర్తి

పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు.

By:  Sivaji Kontham   |   16 March 2026 9:54 AM IST
ఉస్తాద్ ప్రీరిలీజ్: ప‌వ‌ర్‌స్టార్ వ్య‌క్తిత్వం నుంచి నిర్మాత‌ల స్ఫూర్తి
X

హైదరాబాద్‌లో జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని - రవిశంకర్ యలమంచిలి ప్రసంగిస్తూ ప‌వ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మళ్ళీ పని చేయడం తమ బ్యానర్‌కు దక్కిన అతిపెద్ద గౌరవంగా వారు అభివర్ణించారు. నిర్మాత‌ల‌ ప్రసంగంలోని ముఖ్య విషయాలివి...

నిర్మాతలు నవీన్ - రవిశంకర్ మాట్లాడుతూ- గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ మళ్ళీ సెట్స్ పైకి రావడానికి ఎంతో సమయం పట్టినా... ఫలితం మాత్రం అంతకు మించి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడం, ఆయనతో సినిమా నిర్మించడం అనేది ఏ నిర్మాతకైనా ఒక కల అని.. ఆ కల మళ్ళీ `ఉస్తాద్ భగత్ సింగ్`తో నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.

దర్శకుడు హరీష్ శంకర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమాని కావడమే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని నిర్మాత‌లు పేర్కొన్నారు. ఒక అభిమాని తన అభిమాన హీరోని వెండితెరపై ఎలా చూడాలనుకుంటారో హరీష్ అంతకంటే పవర్‌ఫుల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కొనియాడారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఈ సినిమాలో పవర్ స్టార్ మార్క్ వినోదం , సామాజిక అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు.

సినిమా నిర్మాణ విలువలు విషయంలో తాము ఎక్కడా రాజీ పడలేదని రవిశంకర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిందని.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

హీరోయిన్లు రాశీ ఖన్నా, శ్రీలీల నటన గురించి వారు ప్రశంసలు కురిపించారు. శ్రీలీల ఎనర్జీ , రాశీ ఖన్నా పెర్ఫార్మెన్స్ సినిమాకు అదనపు బలాన్ని ఇస్తాయని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో వారిద్దరి సీన్లు చాలా కలర్‌ఫుల్‌గా వచ్చాయని చెప్పారు. ఈ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ ... అత‌డి షూటింగ్ సెట్స్‌లో ఇచ్చే సహకారం గురించి నవీన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా.. షూటింగ్ సమయంలో ప‌వ‌న్ చూపించే క్రమశిక్షణ తమకు ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. అత‌డి సహకారం వల్లే ఈ భారీ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయగలిగామని, నిర్మాతగా ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు.

చివరగా `ఉస్తాద్ భగత్ సింగ్` ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది పవర్ స్టార్ అభిమానులకు ఒక భారీ పండుగ లాంటిదని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించబోతోందని.. పవన్ కళ్యాణ్ మాస్ పవర్ అంటే ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపిస్తుందని చెబుతూ తమ ప్రసంగాన్ని ముగించారు. ఈనెల 19న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.