నైజాం మార్కెట్.. మైత్రీ ప్లాన్ మామూలుగా లేదు!
టాలీవుడ్ లో నిర్మాణ సంస్థగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో కూడా మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు పెంచుతోంది.
By: M Prashanth | 8 Feb 2026 7:00 PM ISTటాలీవుడ్ లో నిర్మాణ సంస్థగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో కూడా మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు పెంచుతోంది. ముఖ్యంగా నైజాం ఏరియా టార్గెట్ చేస్తూ వరుస భారీ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయడానికి మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సిద్ధమవుతోంది. స్టార్ హీరోలు, క్రేజీ డైరెక్టర్లు కాంబోల్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్టులను బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయనుంది.
నిజానికి.. నైజాం మార్కెట్ ఎప్పటి నుంచో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కీలకం. పెద్ద సినిమాల కలెక్షన్లలో సగం వరకు ఆ ఏరియా నుంచే వస్తుంటాయి. దీంతో అక్కడ వరుస బడా సినిమాల రిలీజ్ లతో మైత్రీ స్ట్రాంగ్ హోల్డ్ సాధించాలని ప్లాన్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే నైజాం మార్కెట్ లో గట్టి పోటీ ఉండగా.. మైత్రీ తనదైన ప్లేస్ సంపాదించుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. మైత్రీ స్వయంగా నిర్మిస్తోంది. ఇప్పుడు నైజాంలో రిలీజ్ చేయనుంది. ఆ వెంటనే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా కాంబోలో రూపొందుతున్న పెద్దిని ఏప్రిల్ 30న విడుదల చేయనుంది.
విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమాను మైత్రీ సమర్పిస్తుండడం విశేషం. ఇక 2026 దసరా పండుగ కానుకగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారట.
అదే సమయంలో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందుతున్న స్పిరిట్.. 2027 మార్చి 5న విడుదలకు సిద్ధమవుతోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి హిట్స్ తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న ఆ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటి నుంచే ఆ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసేలా మైత్రీ ప్లాన్ చేసుకోవడంతో ఆ సంస్థ లెక్క ఏంటో క్లియర్ గా తెలుస్తోంది.
మరోవైపు ఎన్టీఆర్– ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ కూడా ఈ ఏడాది విడుదల కానుంది. ఆ చిత్రాన్ని మైత్రీ నిర్మిస్తుండగా.. నైజాంలో విడుదల కూడా చేయనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కలయికలో రూపొందుతున్న AA23 వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా.. నైజాం రైట్స్ మైత్రీనే తీసుకుందట. మొత్తానికి పవన్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ వంటి టాప్ స్టార్స్ సినిమాలను మైత్రీ విడుదల చేయనుండడం మామూలు విషయం కాదు. వరుస రిలీజ్ లతో నైజాం మార్కెట్ పై పట్టు సాధించాలనే లక్ష్యంతో మైత్రీ ముందుకు సాగుతోంది!
