Begin typing your search above and press return to search.

మెగా డీల్! అబ్బాయి వ‌దులుకుంటే బాబాయ్ స‌ర్ధేస్తారు!!

అయితే ఉస్తాద్ ని బ‌రిలోకి తేవాలంటే, ముందుగా హరీష్ శంకర్ వేగం పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చి 27న సినిమా రావాలంటే, ఇప్పుడున్న సమయం చాలా తక్కువ.

By:  Sivaji Kontham   |   24 Jan 2026 11:00 PM IST
మెగా డీల్! అబ్బాయి వ‌దులుకుంటే బాబాయ్ స‌ర్ధేస్తారు!!
X

రెండు మెగా సినిమాలు క్యూలో ఉంటే జ‌రిగే డిబేట్ చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. ఇటీవ‌ల‌ మెగా అభిమానుల మధ్య ఒక ర‌క‌మైన ఉత్కంఠ నెల‌కొంది. పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్`, రామ్ చరణ్ `పెద్ది` సినిమాల విడుదల తేదీల మార్పుల గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న `పెద్ది` సినిమాను మొదట 2026 మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత బ్యాలెన్స్ ఉండటంతో, నిర్మాతలు దీనిని మే నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒక‌వేళ `పెద్ది` ఖాళీ చేసిన అదే తేదీన, అంటే మార్చి 27న `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా కోసం డేట్ లాక్ చేయాల‌ని పవన్ కళ్యాణ్ టీమ్ భావిస్తోందా? అన్న‌దే ప్ర‌స్తుత చ‌ర్చ‌. ఈ రెండు సినిమాలను నిర్మిస్తోంది ఒకే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడంతో, ఒక మెగా హీరో డేట్‌ను మరొక మెగా హీరోకి సర్దుబాటు చేయడం సులువవుతుంది.

అయితే ఉస్తాద్ ని బ‌రిలోకి తేవాలంటే, ముందుగా హరీష్ శంకర్ వేగం పెంచాల్సి ఉంటుంది. ఒకవేళ మార్చి 27న సినిమా రావాలంటే, ఇప్పుడున్న సమయం చాలా తక్కువ. కాబట్టి పోస్ట్-ప్రొడక్షన్ పనులలో ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ వంటి ప‌నుల‌ను హరీష్ శంకర్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల, ఆయన ఇచ్చే తక్కువ సమయంలోనే షూటింగ్ ముగించి, ప్రమోషన్స్ కూడా పక్కాగా ప్లాన్ చేయాలి.

ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే, మైత్రీ మూవీ మేకర్స్ ఒత్తిడి పెరుగుతోంద‌ని అర్థ‌మ‌వ‌తోంది. ముఖ్యంగా `పెద్ది` వాయిదా పడితే, ఆ సమ్మర్ స్లాట్‌ను వదులుకోకుండా ఉస్తాద్ ను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతలు హరీష్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే అబ్బాయి (చరణ్) సినిమా వాయిదా పడటంతో, బాబాయ్ (పవన్) ఆ తేదీని తీసుకోవాలని చూస్తున్నారు. ఒక‌రు వ‌దులుకుంటే ఒక‌రు స‌ర్ధేయ‌డానికి రెడీగా ఉన్నారన్న‌మాట‌. ఈ స‌మ్మ‌ర్ లో మార్చి డేట్ ను ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు వ‌దులుకుంటారో వేచి చూడాలి. ఈ క్రమంలో సినిమాను సకాలంలో సిద్ధం చేసే బాధ్యత ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ భుజాలపై ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీ లీల - రాశి ఖన్నా కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తున్నారు.