మైత్రి మొదటి బాకీ.. బోయపాటిదే!
మైత్రి మూవీ మేకర్స్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్లలో ఒకటి. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది.
By: M Prashanth | 8 Sept 2026 10:17 AM ISTమైత్రి మూవీ మేకర్స్ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్లలో ఒకటి. స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసింది. ఎంతోమంది దర్శకులతో పని చేసింది. కానీ ఈ బ్యానర్ మొదలైనప్పుడు ఇచ్చిన తొలి అడ్వాన్స్ మాత్రం బోయపాటి శ్రీనుకేనట. సర్దార్ 2 ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ ఈ విషయం చెప్పడంతో పాత కమిట్‌మెంట్ మళ్లీ గుర్తొచ్చింది. అడ్వాన్స్ అప్పుడే ఇచ్చారు కానీ సినిమా మాత్రం ఇప్పటికీ రాలేదు.
మైత్రి జర్నీ మొదలైన తర్వాత జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి పెద్ద సినిమాలు వచ్చాయి. సుకుమార్, కొరటాల శివ, బాబీ, గోపీచంద్ మలినేని లాంటి దర్శకులతో బ్యానర్ పని చేసింది. తర్వాత కొత్త దర్శకులతో కూడా సినిమాలు చేసింది. కానీ మొదటి అడ్వాన్స్ తీసుకున్న బోయపాటితో మాత్రం ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు.
ఇక్కడ ఇంకో విషయం ఉంది. బోయపాటి, మైత్రి మధ్య రిలేషన్ అక్కడితో ఆగిపోయినట్టు కూడా కనిపించడం లేదు. సర్దార్ 2 ఈవెంట్‌కు బోయపాటి రావడం, అదే స్టేజ్ మీద రవిశంకర్ పాత అడ్వాన్స్ విషయం గుర్తు చేయడం చూస్తే ఇద్దరి మధ్య బంధం ఇంకా బాగానే ఉందనిపిస్తోంది. అందుకే ఆ పాత కమిట్‌మెంట్ ఎప్పుడైనా మళ్లీ సినిమా వరకు వస్తుందా అనే మాట రావడం సహజం.
బాలకృష్ణతో అఖండ 2 తర్వాత మళ్ళీ కొత్త సినిమా అప్డేట్ లేదు. ఇప్పుడు కూడా పెద్ద హీరోల చుట్టూనే ఆయన పేరు వినిపిస్తోంది. మైత్రి దగ్గర కూడా వరుస స్టార్ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి ఇద్దరూ కలిసి సినిమా చేయాలంటే సరైన హీరో, కథ, డేట్స్ అన్నీ ఒకేసారి కుదరాలి. పైగా బోయపాటి గతంలో సూర్యతో సినిమా కోసం ప్రయత్నించినట్టు టాక్ వచ్చింది. కార్తితో కూడా కథా సిట్టింగ్స్ జరిగాయని ఆయనే చెప్పారు.
అంటే తమిళ స్టార్ హీరోలతో కూడా ఆయన సినిమా చేయాలనే ప్రయత్నం చాలాకాలంగా ఉంది. మైత్రి కూడా పెద్ద మార్కెట్ ఉన్న కాంబినేషన్లను సెట్ చేయడంలో ముందుంటుంది. అందుకే ఈ రెండు వైపులా ఎప్పుడైనా ఒక లెక్క కుదిరే ఛాన్స్ మాత్రం ఉంది. మైత్రి ఎన్నో సినిమాలు పూర్తి చేసింది. కొత్త బ్యానర్ నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. కానీ మొదట ఇచ్చిన అడ్వాన్స్ మాత్రం ఇంకా సినిమా రూపంలో కనిపించలేదు. ఇప్పుడు రవిశంకర్ స్టేజ్ మీదే ఆ విషయాన్ని గుర్తు చేయడంతో, బోయపాటి కూడా ఆ పాత బాకీని ఎప్పుడో ఒకప్పుడు తీర్చాల్సిందేనేమో.
