Begin typing your search above and press return to search.

వారణాసి.. మైత్రీ ప్లాన్ కు అసలు కారణమేంటి?

మహేష్ బాబు స్టార్‌ డమ్, రాజమౌళి బ్రాండ్, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.. ఈ మూడు అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.

By:  M Prashanth   |   14 May 2026 1:44 PM IST
వారణాసి.. మైత్రీ ప్లాన్ కు అసలు కారణమేంటి?
X

టాలీవుడ్‌ లో నిర్మాణ సంస్థగా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో కూడా మరింత స్ట్రాంగ్ గా మారే అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మైత్రీ డిస్ట్రిబ్యూషన్ తో గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ సినిమాలను విడుదల చేస్తూ మార్కెట్‌ లో మంచి పట్టు సాధించిన ఆ సంస్థ.. ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ పై ఫోకస్ పెట్టినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ ను 2022లో ప్రత్యేకంగా నైజాం మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించారు. ఆ తర్వాత తక్కువ సమయంలోనే ఆ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో పెద్ద సినిమాల విడుదలలో కీలక పాత్ర పోషించింది. తమ సొంత నిర్మాణాలతో పాటు ఇతర బ్యానర్ల సినిమాలను కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ లో స్ట్రాంగ్ నెట్‌ వర్క్‌ ను ఏర్పరుచుకుంది.

ముఖ్యంగా ఇతర భాషల చిత్రాలను కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ తమ మార్కెట్‌ ను విస్తరించుకుంది. ఇప్పుడు ఆ సంస్థ ఫోకస్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న వారణాసిపై పడినట్లు సమాచారం. ఆ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకునేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అధికారిక సమాచారం బయటకు రాకపోయినా.. ఆ డీల్‌ పై చర్చలు మాత్రం జోరుగా సాగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం రాజమౌళి ట్రాక్ రికార్డ్. ఆయన తెరకెక్కించిన భారీ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందించాయి. 2015లో విడుదలైన బాహుబలి: ది బిగినింగ్ సుమారు రూ.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా, రూ.114 కోట్ల షేర్ సాధించింది. దీంతో భారీ లాభాలు వచ్చాయి.

ఆ తర్వాత వచ్చిన బాహుబలి 2 అయితే తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.122 కోట్లకు అమ్ముడైన ఆ చిత్రం.. చివరికి రూ.204 కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డులు సృష్టించింది. ఆ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ రిటర్న్స్ రావడంతో రాజమౌళి సినిమాలపై పెట్టుబడి పెట్టడం సేఫ్ గేమ్ అనే అభిప్రాయం మరింత బలపడింది.

అలాగే 2022లో వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా అదే ట్రెండ్‌ ను కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల హక్కులు దాదాపు రూ.191 కోట్లకు అమ్ముడైనా.. లాంగ్ రన్‌ లో రూ.272 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిందని వినికిడి. దీంతో మరోసారి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వచ్చాయి. ఇప్పుడు అదే నమ్మకంతో మైత్రీ డిస్ట్రిబ్యూషన్ వారణాసిపై ముందుగానే స్ట్రాంగ్ ప్లాన్ వేసిందనే చర్చ జరుగుతోంది.

మహేష్ బాబు స్టార్‌ డమ్, రాజమౌళి బ్రాండ్, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్.. ఈ మూడు అంశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. విడుదల సమయానికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి బిజినెస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల హక్కులకు సంబంధించిన డీల్‌ ను మైత్రీ సొంతం చేసుకుంటే.. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశం ఉంది.