Begin typing your search above and press return to search.

దిల్ రాజు అసలైన 'అజాతశత్రువు'.. మైత్రి నిర్మాతల ఆసక్తికర వ్యాఖ్య‌లు

టాలీవుడ్ పాపుల‌ర్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన‌ `ఇరుముడి` సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

By:  Sivaji Kontham   |   3 Sept 2026 9:33 AM IST
దిల్ రాజు అసలైన అజాతశత్రువు.. మైత్రి నిర్మాతల ఆసక్తికర వ్యాఖ్య‌లు
X

టాలీవుడ్ పాపుల‌ర్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన‌ `ఇరుముడి` సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ పాల్గొని మీడియా ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇచ్చారు. హీరో రవితేజ ట్రాక్ రికార్డ్, ప్రాజెక్ట్ బడ్జెట్, ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఉండే పోటీ, కలెక్షన్ల పోస్టర్ల పారదర్శకతపై వారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఈ సినిమాపై అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ కాదా? అని జ‌ర్న‌లిస్ట‌ ప్రశ్నించగా, నవీన్ యెర్నేని ఎంతో సానుకూలంగా స్పందించారు. రవితేజ కెరీర్‌లో ఆయన చూడని గొప్ప బ్లాక్ బస్టర్లు లేవని.. ఆయన ప్రతీ ఒక్కరికీ నచ్చే విలక్షణమైన మాస్ హీరో అని కొనియాడారు. సరైన కథ పడితే ఆయన మళ్లీ తిరుగులేని కంబ్యాక్ ఇస్తారనే నమ్మకం తమకు మొదటి నుంచీ ఉందన్నారు. దానికి తగ్గట్టే `ఇరుముడి` నైజాం ప్రాంతంలోనే మొదటిరోజే 4 కోట్ల భారీ ఓపెనింగ్స్ సాధించి తమ నమ్మకాన్ని నిజం చేసిందని తెలిపారు. అంతేకాకుండా దర్శకుడు శివ నిర్వాణ అనుకున్న రోజుల్లోనే.. సుమారు 50 కోట్ల బడ్జెట్ పరిమితిలోనే రియల్ లొకేషన్లలో పూర్తి చేయడంతో ఇది మొదటి రోజే సేఫ్ ప్రాజెక్ట్‌గా మారిందని చెప్పారు.

సినిమా విజయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ `ఇరుముడి` సక్సెస్‌ను తాము కూడా వేడుక చేసుకుంటున్నామని చెప్పడంపై రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే అది కేవలం ఆ ఒక్క ప్రొడ్యూసర్‌కే కాకుండా ఇండస్ట్రీలోని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. సినిమా రంగానికి ఇదొక ఆరోగ్యకరమైన పరిణామమని.. తర్వాత వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌కు ఇది ఒక అడ్వాంటేజ్‌గా మారుతుందని పేర్కొన్నారు. ఎక్కువ సినిమాలు హిట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ మొత్తం ఉత్సాహంగా ముందుకెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ల మధ్య పోటీ - అనుబంధం గురించి వివరిస్తూ.. సినిమా విడుదల సమయంలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పర్సనల్ అభిప్రాయాలు లేదా పోటీ వాతావరణం ఉంటుందని రవిశంకర్ స్పష్టం చేశారు. కానీ ట్రేడ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ సినిమా బాగా ఆడినా హృదయపూర్వకంగా సంతోషిస్తారని చెప్పారు. దిల్ రాజు గారు పరిశ్రమలోని అందరూ బాగుండాలని కోరుకునే అసలైన `అజాతశత్రువు` అని ఈ సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా అభినందించారు.

ఇక ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తున్న ఫేక్ కలెక్షన్ పోస్టర్లు, ప్రమోషనల్ హడావుడి గురించి నవీన్ యెర్నేని చాలా ఓపెన్‌గా మాట్లాడారు. సినీ పరిశ్రమలోని కొన్ని ప్రత్యేక పరిస్థితులు- బిజినెస్ సమీకరణాల వల్ల ప్రచార చిత్రాల్లో కలెక్షన్లు ఎక్కువగా చూపించాల్సి రావడం ఈ రోజుల్లో `పార్ట్ ఆఫ్ ది గేమ్` అయిపోయిందని ఆయన అంగీకరించారు. అయితే `ఇరుముడి` సినిమా విషయంలో మాత్రం తాము అలాంటి పని చేయలేదని.. పూర్తి పారదర్శకతతో జెన్యూన్ కలెక్షన్లను మాత్రమే ప్రకటించామని తెలిపారు. ``మీరు కలెక్షన్లను తగ్గించి వేస్తున్నారంటగా?`` అని మీడియా అడగ్గా.. తాము తగ్గించడం లేదని.. బాక్సాఫీస్ వద్ద ఎంత వచ్చాయో అంత కరెక్ట్‌గానే వేస్తున్నామని మైత్రి నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

ఆ ఇష్యూ త‌ర్వాతా మిత్ర‌త్వం:

అయితే ఈ స‌క్సెస్ మీట్ లో మైత్రి నిర్మాత‌లు ప‌ర్టిక్యుల‌ర్ గా దిల్ రాజు అసలైన `అజాతశత్రువు` అని పొగిడేయ‌డంపై మీడియాలో చ‌ర్చ సాగింది. ఈ రంగంలో శాశ్వ‌త మిత్ర‌త్వం.. శాశ్వ‌త శ‌త్రుత్వం ఉండ‌వ‌ని, ఒక‌రి సినిమా ఆడితే మ‌రొక‌రు వారిని ప్ర‌శంసిస్తార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. వ్యాపార‌ప‌ర‌మైన పోటీ ఉండొచ్చు.. కానీ దానిని శ‌త్రుత్వంగా చూడ‌కూడ‌ద‌న్న చ‌ర్చ కూడా మీడియాలో న‌డిచింది. ఇటీవ‌ల తెలంగాణ‌లోని సింగిల్ స్క్రీన్ల ఇష్యూలో దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీ మేక‌ర్స్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే.