Begin typing your search above and press return to search.

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

‘సత్యవాన్ సావిత్రి’ ప్రెస్‌మీట్‌లో మిస్కిన్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు కీర్తి సురేష్ స్పందించారు. తనకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని, వేదికపై తమ మధ్య తండ్రీకూతుళ్ల అనుబంధం ఉందని స్పష్టం చేశారు. సినిమాల్లో నటించినంత మాత్రాన బయట ఎవరైనా ఎలా తాకినా అంగీకరించాలా అని ప్రశ్నించారు. దీంతో వివాదాస్పద ట్వీట్ చేసిన నెటిజన్ క్షమాపణలు చెప్పారు.

By:  Sivaji Kontham   |   21 Nov 2026 9:04 AM IST
ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!
X

కీర్తి సురేష్, ప్రముఖ దర్శక నటుడు మిస్కిన్ కలిసి నటించిన `సత్యవాన్ సావిత్రి` మూవీ ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఓ వీడియో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నైలో జరిగిన ఈ సినిమా ప్రమోషనల్ వేడుకలో మిస్కిన్ కీర్తి సురేష్ నటనను ప్రశంసిస్తూ.. త‌న ఒడిపై అచేత‌నంగా చేయి వేసి అభినందించారు. అయితే ఈ క్షణానికి సంబంధించిన చిన్న క్లిప్‌ను కొందరు నెటిజన్లు వైరల్ చేస్తూ.. మిస్కిన్ ప్రవర్తనతో కీర్తి సురేష్ అసౌకర్యానికి గురయ్యారంటూ రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. సినిమాల్లో అన్ని రకాల సన్నివేశాల్లో నటించే హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లలో ఇలా చిన్నగా తాకితే ఎందుకు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఆన్‌లైన్‌లో పెద్ద దుమారాన్నే రేపింది.

ఈ వివాదంపై ఎట్టకేలకు కీర్తి సురేష్ స్వయంగా స్పందిస్తూ సదరు నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన ముఖంలో ఎక్కడ అసౌకర్యం కనిపించిందని సూటిగా ప్రశ్నించిన కీర్తి.. వేదికపై తమ మధ్య తండ్రీకూతుళ్ల వంటి అనుబంధం ఉందని మిస్కిన్- తాను చెప్పిన మాటలు వినిపించలేదా అని నిలదీశారు. ఒకవేళ తాను నిజంగానే అసౌకర్యానికి గురయ్యానని అనుకున్నా... సినిమాల్లో నటించినంత మాత్రాన బయట పబ్లిక్‌లో కూడా ఎవరు ఎలా తాకినా ఓకే అనుకోవాలా? అంటూ ఘాటుగా బదులిచ్చారు. నటీనటుల వ్యక్తిగత హద్దుల విషయంలో ఆలోచనా విధానం మార్చుకోవాలని హితవు పలకడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కీర్తి సురేష్ ఇచ్చిన స్ట్రాంగ్ రిప్లైతో వివాదాస్పద ట్వీట్ చేసిన కార్తీక్ అనే నెటిజన్ వెనక్కి తగ్గారు. తన పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేసిన అత‌డు కీర్తి సురేష్‌కు బహిరంగంగా క్షమాపణలు చెబుతూ మరో ట్వీట్ చేశారు. తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదని.. కేవలం ఆ వీడియో వైరల్ అవుతుండటంతోనే తాను కూడా షేర్ చేశానని వివరణ ఇచ్చారు. అసలు వీడియో పూర్తిగా చూడకుండా.. కేవలం కొన్ని సెకన్ల క్లిప్ ఆధారంగా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని పలువురు సినీ అభిమానులు సైతం కీర్తి సురేష్‌కు మద్దతుగా నిలిచారు.

మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీర్తి సురేష్ స్పందించిన విధానాన్ని మెచ్చుకుంటూ కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం దీనిని సినిమా విడుదల సమయానికి ముందు జరుగుతున్న పీఆర్ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన మరో ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ గురించి కీర్తి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా.. పూర్తి సందర్భం తెలియకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే క్లిప్స్ వల్ల సెలబ్రిటీలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ ఉదంతం మరోసారి స్పష్టం చేసింది.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన `అక్క` వెబ్ సిరీస్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి ఆద‌ర‌ణ పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా కీర్తి న‌ట‌న‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. ఇప్పుడు మిస్కిన్ కీలక పాత్ర పోషించిన `సత్యవాన్ సావిత్రి` చిత్రం నవంబర్ 20న విడుదలైంది. వివాదాలకు తెరదించుతూ కీర్తి ఇచ్చిన క్లారిటీతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది. సినిమా ప్రమోషన్లలో భాగంగా నటీనటుల మధ్య ఉండే సహజమైన ఆప్యాయతను తప్పుగా చిత్రీకరించడం సరికాదనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.