Begin typing your search above and press return to search.

మైసా టీజర్ టాక్: నెత్తుటి వేటలో రష్మిక.. మాస్ యాక్షన్

టీజర్ ఓపెనింగ్ లోనే ఒక అందమైన సన్ సెట్ బ్యాక్ డ్రాప్ లో అలసిపోయాను, ఆగిపోయాను, ఓడిపోయాను అంటూ రష్మిక ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ తో క్యూరియాసిటీ మొదలవుతుంది.

By:  M Prashanth   |   20 Sept 2026 7:28 PM IST
మైసా టీజర్ టాక్: నెత్తుటి వేటలో రష్మిక.. మాస్ యాక్షన్
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన రూట్ మార్చేసి సరికొత్త ప్రయోగాలకు సిద్ధమైంది. ఒకవైపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ లో అచ్చమైన క్లాసికల్ రోల్ చేస్తూనే, దానికి పూర్తిగా బిన్నంగా 'మైసా' సినిమాలో రగ్గడ్ అండ్ రస్టిక్ యాక్షన్ అవతారంలోకి మారిపోయింది. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఈ ఫీమేల్ లీడ్ సినిమాను నిర్మిస్తోంది. ఇక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ ను మేకర్స్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

టీజర్ ఓపెనింగ్ లోనే ఒక అందమైన సన్ సెట్ బ్యాక్ డ్రాప్ లో అలసిపోయాను, ఆగిపోయాను, ఓడిపోయాను అంటూ రష్మిక ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ తో క్యూరియాసిటీ మొదలవుతుంది. ఆ వెంటనే ఒక దట్టమైన అటవీ ప్రాంతం, ముసుగులు వేసుకున్న మనుషులు, మంటల మధ్య జరిగే గిరిజన ఆచారాలతో కథలోని డార్క్ థీమ్ ను పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. మైసా మేశ్రమ్ అనే పవర్ ఫుల్ గిరిజన యువతిగా రష్మిక మేకోవర్ చాలా సహజంగా ఉంది.

ఈ క్రైమ్ యాక్షన్ డ్రామాకు బలమైన తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ను జోడించినట్లు విజువల్స్ ద్వారా తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ బయట కూర్చుని చేతిలో ఒక ఫోటో పట్టుకుని రష్మిక ఏడుస్తున్న షాట్, అలాగే చావు నుండైనా నీకోసం వస్తాను నాన్నా అని ఆమె చెప్పే డైలాగ్ కథలోని ఎమోషనల్ కోర్ ను రివీల్ చేస్తున్నాయి. బయట అంత మంది జనం ఉంటే ఆమె ఒక్కతే అనే మాట వింటుంటే, ఒక పెద్ద ముఠాతో ఒంటరిగా పోరాడే వీరనారి పాత్రలో ఆమె కనిపించనుందని అర్థమవుతోంది.

యాక్షన్ సీక్వెన్సుల విషయంలో దర్శకుడు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. అడవిలో రష్మిక చేసే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, జలపాతం పైనుంచి దూకే సీన్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎలాంటి బాడీ డబుల్ లేకుండా ఏకధాటిగా షూట్ చేసిన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ టీజర్ కే మెయిన్ హైలైట్ గా నిలిచింది. నీళ్లలో ఒక వ్యక్తిని దారుణంగా కొడుతూ రక్తం చిందించే షాట్స్ లో రష్మిక ఇంటెన్సిటీ మునుపెన్నడూ చూడని విధంగా చాలా కొత్తగా ఉంది.

యుద్ధానికి ఆయుధం అంటే భయం గానీ, ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు అంటూ హీరోయిన్ యాటిట్యూడ్ ను ఎలివేట్ చేసే డైలాగ్స్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఈమె ఒక వెపన్ అంటూ రావు రమేష్ చెప్పిన డైలాగ్ ఆమె క్యారెక్టర్ డెప్త్ ను మరింత పెంచింది. సముద్రఖని, రాహుల్ రవీంద్రన్ తదితర సీనియర్ నటీనటుల ప్రెజెన్స్ తో పాటు జేక్స్ బిజోయ్ ఇచ్చిన ఇంటెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ ఫీల్ ను చాలావరకు ఎలివేట్ చేసింది.

వచ్చే నవంబర్ 27న పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కు ట్రైబల్ బ్యాక్ డ్రాప్ ను ముడిపెట్టి తీసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక సినిమాటిక్ అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్స్ తో పాటు స్క్రీన్ ప్లే కూడా గ్రిప్పింగ్ గా ఉంటే సోలో లీడ్ గా రష్మికకు ఇది ఒక రేంజ్ హిట్ ఇచ్చే అవకాశం ఉంది.