బ్యాంకాక్ టు కేరళ - మైసా కోసం రష్మిక యాక్షన్ జర్నీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో `మైసా` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 19 April 2026 1:59 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో `మైసా` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. మైసా పాత్రలో రష్మిక ఆహార్యం ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఆ పాత్రకు తాను మాత్రమే సూటవుతుందని తొలి పోస్టర్ తోనే ప్రూవ్ చేసింది. అటుపై రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు అంతకంతకు రెట్టింపు చేసింది. ఈ సినిమా క్లిక్ అయితే రష్మిక రేంజ్ మారిపోవడం ఖాయం. నటిగా రష్మిక జీవితంలో కొత్త ప్రయాణం మొదలైనట్లే.
తాజాగా ఈ సినిమా కోసం రష్మిక ఎంతగా శ్రమిస్తుందన్నది బయటకు వచ్చింది. సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాల కోసం అమ్మడు బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటుంది. గ్లామర్ కే పరిమితం కాకుండా కఠినమైన పోరాట విద్యల్లో ఆరితేరిన యోధురాలిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోబోతోంది. ఈ శిక్షణలో భాగంగా రష్మిక బ్యాంకాక్‌లోని ప్రసిద్ధ మార్షల్ ఆర్ట్స్ నిపుణుల సమక్షంలో స్టంట్స్ - కాంబాట్ మెళకువలను నేర్చుకుంటోంది. ఇది ఎంతో కఠినమైన శిక్షణ. ట్రైనింగ్ లో ఏమాత్రం తప్పిదాలు దొర్లినా? ఎముకలు విరిగిపోవడానికి అవకాశం ఉంది.
తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రత్యర్ధిపై దాడి చేయడం అంత సులభం కాదు. ఎంతో అనుభవం, నేర్పు ఉంటే తప్ప సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో రష్మిక ఎక్కడా రాజీ పడకుండా నేర్చుకుంటుంది. ముఖ్యంగా డూప్ సహాయం లేకుండా రియలిస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లలో నటించాలని రష్మిక పట్టుదలతో ఉంది. అందుకే రోజులో ఎనిమిది గంటలు పాటు ట్రైనింగ్ కే కేటాయిస్తుంది. ట్రైనింగ్ అనంతరం తిరిగొచ్చిన తర్వాత తదుపరి కీలక షెడ్యూల్ కేరళలో ప్రారంభం కానుంది. కేరళలోని దట్టమైన అడవులు , సహజ సిద్ధమైన లొకేషన్లలో దాదాపు 16 రోజుల పాటు సుదీర్ఘంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ షెడ్యూల్‌లోనే రష్మిక బ్యాంకాక్‌లో నేర్చుకున్న విద్యలను వెండితెరపై ప్రదర్శించనుంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ ఫైట్స్ ఉండబోతున్నాయని సమాచారం. కమర్షియల్ హీరోయిన్ ఈ స్థాయిలో రిస్క్ తీసుకొని యాక్షన్ సినిమా చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. `పుష్ప` వంటి చిత్రాలతో నటనలో ప్రతిభ చాటుకున్న రష్మిక `మైసా` తో కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లోకి మారిపోతుంది. పాత్ర కోసం ఇంతటి కఠినమైన శిక్షణ తీసుకోవడం ఆమె వృత్తి పట్ల చూపిస్తోన్న అంకితభావానికి నిదర్శనం. ఈ చిత్రం హిట్ అయితే రష్మిక కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
