అంతగా ఏం ఎడ్యుకేట్ చేశారు సర్?
కొందరు తెలిసీ తెలియక చేసే కామెంట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కూడా అలాంటి కామెంట్సే చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Aug 2025 11:00 PM ISTకొందరు తెలిసీ తెలియక చేసే కామెంట్స్ వివాదాస్పదంగా మారుతుంటాయి. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కూడా అలాంటి కామెంట్సే చేశారు. వరల్డ్ సినిమాలో ఇండియన్ సినిమా స్థాయి విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి రూ.1000 కోట్ల కలెక్షన్లపైనే ఉంది. పెద్ద సినిమా ఏది రిలీజ్ కాబోతున్నా అది రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అనేది ప్రశ్నగా మారింది.
బాలీవుడ్ లో ఇప్పటికే రూ.1000 కోట్ల సినిమాలు పలు ఉండగా, టాలీవుడ్ కు కూడా బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్, కల్కి లాంటి సినిమాలున్నాయి. కెజిఎఫ్ తో కన్నడ ఇండస్ట్రీ రూ.1000 కోట్లు అందుకోగా, తమిళంలో మాత్రం ఇప్పటివరకు ఒక్క వెయ్యి కోట్ల సినిమా కూడా రాలేదు. దీంతో తమిళ ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వచ్చినా దానిపై వారు ఆశలు పెంచుకోవడం, ఆ సినిమా వారి ఆశలను నిరాశగా మిగల్చడం కామనైపోయింది.
కోలీవుడ్ కు తీరని కలగా..
జైలర్, లియో, విక్రమ్, కంగువ, రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాలు వెయ్యి కోట్లు ఆశిస్తాయని తమిళులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవన్నీ నిరాశనే మిగిలాయి. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ నుంచి ఏదైనా పెద్ద సినిమా రిలీజవుతుంటే ఆ చిత్ర దర్శకనిర్మాతలకు రూ.1000 కోట్ల కలెక్షన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కు కూడా ఇప్పుడా ప్రశ్న ఎదురైంది.
విచిత్రమైన సమాధానం
మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుండగా మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న డైరెక్టర్ మురుగదాస్ కు రూ.1000 కోట్ల కలెక్షన్లకు సంబంధించిన ప్రశ్న ఎదురవగా దానికి ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. వేరే భాషల డైరెక్టర్లు ఆడియన్స్ ను ఎంటర్టైన్ మాత్రమే చేస్తారని, కానీ తమిళ డైరెక్టర్లు ఆడియన్స్ ను ఎడ్యుకేట్ చేస్తారని, అందుకే మనకు కలెక్షన్లు రావని, తమిళ సినిమాల్లో ఏం చేయాలి? ఏం చేయకూడదనేవి చెప్తామని, తమిళ డైరెక్టర్లను వేరే డైరెక్టర్లతో పోల్చకూడదని చెప్పడంతో ఈ విషయంలో ఆయన్ను ఏమనాలో అర్థం కాని పరిస్థితుల్లో నెటిజన్లు ఉన్నారు.
మురుగదాస్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
మురుగదాస్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆయన కామెంట్స్ పై ఇతర సినీ పరిశ్రమలకు చెందిన ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మురుగదాస్ చేసిన సినిమాలు ఆడియన్స్ ను ఏం ఎడ్యుకేట్ చేశాయని కొందరంటుంటే, తమిళ వాళ్లు మెసేజ్‌లు ఇవ్వడానికే సినిమాలు చేస్తే స్పైడర్, సికిందర సినిమాలతో ఆడియన్స్ కు ఏం నేర్పించారని విమర్శలు చేస్తున్నారు.
