ఆ డైరెక్టర్ ఈసారైనా హిట్ కొడతారా?
సినీ ఇండస్ట్రీలో ఎవరెప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో, ఎవరు ఎప్పుడు ఫామ్ కోల్పోతారో ఎవరూ ఊహించలేరు.
By: Sravani Lakshmi Srungarapu | 25 Aug 2025 12:28 PM ISTసినీ ఇండస్ట్రీలో ఎవరెప్పుడు లైమ్ లైట్ లోకి వస్తారో, ఎవరు ఎప్పుడు ఫామ్ కోల్పోతారో ఎవరూ ఊహించలేరు. కేవలం ఒకే ఒక్క సినిమా ఎంతో మంది జీవితాలను రాత్రికి రాత్రే మారుస్తుంది. ఒకప్పుడు గజినీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన మురుగుదాస్ గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ ఫామ్ లో లేరు. మొన్నీ మధ్యనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సికందర్ చేస్తే ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది.
సికందర్‌తో డిజాస్టర్
అయితే సికందర్ తప్పుని అందరూ సల్మాన్ పై వేశారు కానీ అందులో కంటెంట్ ఏమీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మురుగదాస్ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన మదరాసి సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా కావడంతో పాటూ అమరన్ తర్వాత ఆయన్నుంచి వస్తున్న మూవీ కావడంతో మదరాసి బిజినెస్ బాగానే జరిగింది.
డిఫరెంట్ గా ట్రై చేసిన మురుగదాస్
ఆల్రెడీ మదరాసి నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఈసారి మురుగదాస్ ఏదో డిఫరెంట్ గానే ట్రై చేసినట్టు అనిపిస్తోంది. అంతులేని ఆవేశంతో అన్యాయం జరిగితే విపరీతంగా తిరగబడే హీరో, తమిళనాడులోకి రావాలనుకునే ఓ టెర్రరిస్ట్ గ్యాంగ్ ను అడ్డుకోవాల్సి వస్తుంది. దాని కోసం హీరో పడే తిప్పలేంటి? అసలు మదరాసీలకు, టెర్రరిస్టులకు ఉన్న లింక్ ఏంటనేది సినిమా చూస్తేనే తెలిస్తుంది.
హీరోయిన్ గా రుక్మిణి
ట్రైలర్ చూడగానే వావ్ అనేలా లేదు కానీ అందులోని యాక్షన్, విజువల్స్ చూస్తుంటే ప్రామిసింగ్ గానే అనిపించింది. పైగా దానికి అనిరుధ్ బీజీఎం. సప్త సాగరాలు దాటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. అసలే కోలీవుడ్ డైరెక్టర్లు జనాలను ఎడ్యుకేట్ చేస్తారని రీసెంట్ గానే కామెంట్ చేసిన మురుగదాస్ మరి మదరాసి తో ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారో చూడాలి. మరి శివ కార్తికేయన్ అయినా మురుగదాస్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారేమో చూడాలి.
