మురుగదాస్.. స్టేట్మెంట్స్ ఆపితే మంచిది!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సికిందర్ మూవీ కోసం మాట్లాడారు. ఆ సమయంలో తానొక్కడినే ఫలితానికి బాధ్యుడిని కాదని తెలిపారు.
By: M Prashanth | 20 Aug 2025 8:30 AM ISTకోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ గురించి తెలిసిందే. ఇప్పటికే అనేక సినిమాలు తీసిన ఆయన.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. మేకింగ్ అండ్ టేకింగ్ తో అలరించారు. చిరంజీవి, మహేష్ బాబు, అమీర్ ఖాన్, సూర్య, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి మెప్పించారు. కానీ ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.
కొంతకాలంగా ఆయన తీస్తున్న సినిమాలు అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాయి. రీసెంట్ గా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ మూవీ డిజాస్టర్ గా మారింది. సల్మాన్ ఖాన్ మంచి ఛాన్స్ ఇచ్చినా ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇప్పుడు శివకార్తికేయన్ తో మదరాసి మూవీ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ కానుంది.
ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలతో హాట్ టాపిక్ గా మారారు. వివాదాస్పద స్టేట్మెంట్లు ఇస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాను చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి హీరోలే కారణమంటూ పరోక్షంగా కామెంట్స్ చేస్తుండడంతో ఆయా కథానాయకుల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సికిందర్ మూవీ కోసం మాట్లాడారు. ఆ సమయంలో తానొక్కడినే ఫలితానికి బాధ్యుడిని కాదని తెలిపారు. అక్కడితో ఆగకుండా.. సల్మాన్ ఖాన్ రాత్రి ఎనిమిది తర్వాతే షూటింగ్ కు వచ్చేవారని అన్నారు. దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకున్నానని, సౌత్ లో అలా కాదని, ఉదయమే షూటింగ్ స్టార్ట్ చేస్తామని వ్యాఖ్యానించారు.
దీంతో సల్మాన్ ఫ్యాన్స్.. మురుగదాస్ ను ట్రోల్ చేస్తున్నారు. అలాంటప్పుడు సినిమా రద్దు చేసుకోవాల్సి ఉందని, అంతే గానీ ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. మరో ఇంటర్వ్యూలో దర్బార్ మూవీ ప్రస్తావనకు తీసుకురాగా.. ఆ సినిమా టైమ్ లో నెగిటివ్ క్యాంపైన్ జరిగిందని చెప్పుకొచ్చారు మురుగదాస్.
కొన్ని పొలిటికల్ ఫోర్సులు వల్ల సినిమాకు ఇబ్బంది వచ్చిందని అన్నారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. అందరినీ ఆకట్టుకునేలా తీయకుండా ఇలాంటి మాటలేంటని నిలదీస్తున్నారు. రీసెంట్ గా రూ.1000 కోట్లు డైరెక్టర్లపై వివాదస్పదంగా మాట్లాడారు. మొత్తానికి సినిమాపై కాకుండా.. ఇలాంటి కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు.
నిజానికి.. మదరాసి మూవీపై అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ లో బజ్ క్రియేట్ అవ్వలేదు. రిలీజ్ కు తక్కువ సమయమే ఉన్నా.. ఇంకా హైప్ రాలేదు. అయితే మురుగదాస్ మాత్రం హిట్ కొడతానని చెబుతున్నారు. ఏదేమైనా కంటెంట్ ఉంటే హిట్ సాధించొచ్చు. కానీ వివాదాస్పద స్టేట్మెంట్స్ మాత్రం ఆపితే మంచిదనే చెప్పాలి.
