ఇంత పెద్ద కల కనే ధైర్యం కూడా లేదు!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు మురళీ శర్మ.
By: Srikanth Kontham | 13 Sept 2026 7:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు మురళీ శర్మ. హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో మూడు దశాబ్దాలకు పైగా సాగిన నటనా ప్రయాణం ఎంతో మందికి స్పూర్తి దాయకం. ఇప్పటి వరకు 250కి పైగా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన సీనియర్ నటుడు ఇటీవలే ఓటీటీ రంగంలోకి సైతం అడుగుపెట్టి మరింత విస్తరించుకున్నారు. ఈ నేపథ్యంలో మురళీ శర్మ సుదీర్ఘమైన సినీ ప్రయాణాన్ని, పరిశ్రమలో వచ్చిన మార్పులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
250 సినిమాల్లో నటించడం అనేది తానెప్పుడు కలలో కూడా అనుకోలేదన్నారు. అంత ధైర్యమే తనకు లేదన్నారు. జీవితం తన పట్ల ఎంతో దయ చూపించిందని, నటుడిగా విధి తనకు ఊహించని విజయాన్ని, ప్రజల ఆదరణను అందించిందన్నారు. కెరీర్‌లో పాత్ర నిడివికి కంటే ఆ పాత్ర ప్రభావానికే ప్రాధాన్యత ఇచ్చానని మురళీ శర్మ స్పష్టం చేశారు. పాత్ర చిన్నదా? పెద్దదా ? అనేది తానెప్పుడు కొలమానంగా తీసుకోలేదని.. కథలో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత, దానికి తాను ఏమేరకు న్యాయం చేయగలననేదే చూసుకుంటానని తెలిపారు.
భిన్నమైన శైలి ఉన్న పాత్రలు వెతుక్కుంటూ రావడం నటుడిగా తన అదృష్టమని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమలో మురళీ శర్మను ఎక్కువగా ఆదర్శవంతమైన తండ్రి పాత్రల్లో చూస్తుంటారు. ఒకే రకమైన పాత్రలు రావడం వల్ల టైప్‌కాస్ట్ అవుతాననే భయం తనకు ఎప్పుడూ కలగలేదన్నారు. పాత్ర స్వభావం ఎలాంటిదైనా? ఆ పాత్రకు తన నటన ద్వారా ప్రాణం పోయడమే నటుడి ప్రాథమిక బాధ్యతని నమ్ముతానన్నారు. పాత్రపై ఉంచే శ్రద్ధే ప్రేక్షకులను మెప్పిస్తుందని అభిప్రాయపడ్డారు.
బాలీవుడ్‌లో `సింగం`, `గోల్‌మాల్ రిటర్న్స్`, `మై హూ నా`, `భూల్ భూలయ్యా 2` వంటి భారీ చిత్రాల్లో నటించి మెప్పించిన మురళీ శర్మ టాలీవుడ్‌లోనూ ఎన్నో ఘనవిజయాలలో భాగస్వామ్యమయ్యారు. ప్రతి సినిమా ఓ కొత్త అనుభవాన్ని అందించడమే కాకుండా విభిన్న భాషలకు చెందిన ప్రేక్షకులకు తనను చేరువ చేసిందని సంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమలో సాంకేతికత , కథలు ఎంత మారినా మంచి కథకు , సహజమైన నటనకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్నారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడమే తనను ఇన్నేళ్లుగా నడిపి స్తోందన్నారు. ఓటీటీ అరంగేట్రంతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టిన మురళీ శర్మ భవిష్యత్తులో మరిన్ని విలక్షణమైన పాత్రలతో అక్కడా అలరించాలని నెటి జనులు కోరుకుంటున్నారు.
