పిక్‌టాక్ : చనిపోయిన మున్నా భాయ్ తిరిగి వచ్చాడు
ఇండియాలో ఓటీటీ కంటెంట్‌కి అమితంగా ఆధరణ ఉంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌కి మంచి స్పందన లభిస్తోంది.
By: Ramesh Palla | 22 Nov 2025 1:10 PM ISTఇండియాలో ఓటీటీ కంటెంట్‌కి అమితంగా ఆధరణ ఉంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌కి మంచి స్పందన లభిస్తోంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లకు ఏమాత్రం తగ్గకుండా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను అత్యధికంగా ప్రేక్షకులు చూసిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పటి వరకు మూడు సీజన్‌లు స్ట్రీమింగ్ అయింది. నాలుగో సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదిలో కొత్త సీజన్ ఉండవచ్చు అంటున్నారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‌లో నటించిన నటీనటులు బాగా పాపులారిటీని సొంతం చేసుకున్నారు. వారి సొంత పేర్లతో కాకుండా వెబ్ సిరీస్‌లోని వారి పేర్లతోనే బయట కూడా వారిని పిలుస్తూ ఉన్నారు. మీర్జాపూర్ తో వచ్చిన గుర్తింపుతో చాలా మంది సినిమాల్లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.
మీర్జాపూర్ వెబ్ సిరీస్ 4 ఎప్పుడు..
మీర్జాపూర్ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు దివ్యేందు త్రిపాఠి. ఇతడు మీర్జాపూర్‌లో మున్నా భాయ్ పాత్రలో కనిపించాడు. సోషల్ మీడియాతో పాటు బయట కూడా ఇతడిని అంతా మున్నా భాయ్ అంటూ పిలుస్తారు. ఆ పాత్రకు ప్రాణం పోసినట్టుగా దివ్యేందు నటించాడు అంటూ అభిమానులతో పాటు అంతా కూడా బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే ఆయన పాత్ర కోసం, ఆయన నటన కోసం చాలా మంది మీర్జాపూర్ చూశాం అంటారు. అలాంటి పాత్రను మూడో సీజన్‌లో చంపేయించడం జరిగింది. మున్నా భాయ్ పాత్రను గుడ్డు పండిట్ చేతిలో చంపేయించడం జరిగింది. దాంతో మీర్జాపూర్‌లో ఇక మున్నా భాయ్ కనిపించడని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అయ్యే విధంగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మున్నా భాయ్ మళ్లీ వచ్చాడు
మున్నాభాయ్‌తో పాటు మీర్జాపూర్‌కి చెందిన ముఖ్య నటీనటులు అంతా కూడా ఈ ఫోటోలో ఉన్నారు. ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌గా అలరించిన మీర్జాపూర్‌ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. ది మీర్జాపూర్ టైటిల్ తో హిందీలో రూపొందుతున్న సినిమా షూటింగ్ సందర్భంగా వీరంతా కలిశారు. వెబ్ సిరీస్‌లో నటించిన వారు అంతా కూడా ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నారు అంటున్నారు. సినిమాకు తగ్గట్లుగా కథ, స్క్రీన్ ప్లే మార్చి కాస్త డీసెంట్ గా మీర్జాపూర్‌ను రూపొందిస్తున్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మీర్జా పూర్ సినిమా షూటింగ్ కోసం మున్నా భాయ్ రావడంతో పాటు, అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా కూడా మున్నాభాయ్ మళ్లీ వచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్...
ఇప్పటి వరకు తన పాత్రతో వెబ్ సిరీస్‌లో మెప్పించిన దివ్యేందు త్రిపాఠి సినిమాలోనూ కచ్చితంగా మున్నాభాయ్ గా అలరిస్తాడు అనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ పూర్తి అయిన తర్వాత మున్నా భాయ్ ఉన్న ఒక ఎపిసోడ్ ను ప్రత్యేకంగా మేకర్స్ విడుదల చేయడం జరిగింది. అది కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు సినిమాతో మున్నా భాయ్ ఇతర మీర్జాపూర్ యూనిట్ సభ్యులు అంతా కూడా అలరిస్తారేమో చూడాలి. ఈమధ్య కాలంలో సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లకు సీక్వెల్స్ రావడం చాలా కామన్ విషయం అయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తాజాగా మూడో సీజన్ స్ట్రీమింగ్ అయింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది. అందుకే మీర్జాపూర్ వెబ్ సిరీస్ నుంచి కూడా నాల్గవ సీజన్ తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
