భర్త వివాహేతర సంబంధంపై బహిరంగంగా నటి కామెంట్
నేను నటించడం ప్రారంభించినప్పుడు చిన్నపిల్లని. నాది అంత తేలికైన ప్రయాణం కాదు. కానీ అగ్రస్థానానికి చేరుకున్నాను అని కూడా తెలిపారు.
By: Sivaji Kontham | 1 Aug 2025 5:00 AM ISTబాలీవుడ్ లో క్లాసిక్ డే సినిమాని ఏలిన మేటి కథానాయిక ముంతాజ్ దాదాపు 35 ఏళ్ల తర్వాత తిరిగి నటనలోకి పునఃప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. నాటి అగ్ర కథానాయకులందరి సరసన నటించిన ఈ వెటరన్ కథానాయికకు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా ఒక వ్యాపారవేత్తను పెళ్లాడి పరిశ్రమనుంచి నిష్కృమించారు. అప్పటికి పారితోషికంలో నంబర్ వన్ నటిగా కొనసాగుతున్నారు.
పారితోషికంలో నంబర్ వన్:
మూడున్నర దశాబ్ధాల తర్వాత ముంతాజ్ తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నారు. ఇటీవల హీరామండిలో నటించాల్సిందిగా సంజయ్ లీలా భన్సాలీ ముంతాజ్ కి అవకాశం కల్పించారు. కానీ పారితోషికం సరిపోలేదనే కారణంగా తిరస్కరించానని ముంతాజ్ బహిరంగంగా చెప్పారు. నాకు అవసరమైనవన్నీ ఉన్నాయి.. ఇంత తక్కువ డబ్బుకు నేను పని చేయలేను! అని ముంతాజ్ వ్యాఖ్యానించడం తన కాన్ఫిడెన్స్ ని, దర్పాన్ని బహిర్గతం చేసింది. పైగా తాను పరిశ్రమ నుంచి వైదొలిగే సమయానికి అత్యధిక పారితోషికం అందుకుంటున్న కథానాయికగా కొనసాగిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు ఈ సీనియర్ నటీమణి.
భారీ ఫాలోయింగ్:
నేను నటించడం ప్రారంభించినప్పుడు చిన్నపిల్లని. నాది అంత తేలికైన ప్రయాణం కాదు. కానీ అగ్రస్థానానికి చేరుకున్నాను అని కూడా తెలిపారు. 70లలో దో రాస్తే, హరే రామ హరే కృష్‌ణ, ప్రేమ్ కహానీ, ఆప్ కీ కసమ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ముంతాజ్ నటించారు. ప్రపంచంలో అన్ని మూలలా ముంతాజ్ కి ఫ్యాన్సున్నారు.
నా భర్త క్షమాపణలు కోరారు:
ముంతాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన భర్త మయూర్ వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు తాను చాలా హర్ట్ అయ్యానని, తర్వాత అతడు తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడని కూడా ముంతాజ్ వెల్లడించారు. వివాహబంధం ఎంతో గొప్పదని, ఆ బంధాన్ని విడనాడాలనే ఆలోచన తనకు లేదని కూడా ముంతాజ్ అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం ధనికుడైన తన భర్తను విడనాడలేదని కూడా సూటిగా చెప్పారు.
