Begin typing your search above and press return to search.

తారల వర్షాకాల ప్రణాళికలు - ట్రాఫిక్ తిప్పలు!

దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రోడ్లపై నీరు నిలవడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ,సుదీర్ఘ ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు

By:  Srikanth Kontham   |   25 Jun 2026 12:02 PM IST
తారల వర్షాకాల ప్రణాళికలు - ట్రాఫిక్ తిప్పలు!
X

మహారాష్ట్రలో ఎదురుచూస్తున్న వర్షాకాలం ఎట్టకేలకు ఆలస్యంగానైనా ప్రారంభమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతుండటంతో సాధారణ ప్రజలతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రోడ్లపై నీరు నిలవడం, గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ,సుదీర్ఘ ప్రయాణ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నగరం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి .. వృత్తిపరమైన షెడ్యూళ్లను సకాలంలో పూర్తి చేయడానికి వివిధ రంగాలకు చెందిన నటీనటులు, గాయకులు అనుసరిస్తున్న వినూత్న ప్రణాళికలు ఆసక్తికరంగా మారాయి.

అదా శర్మ ముంబై వర్షాల సమయంలో ప్రయాణించడంపై తనదైన శైలిలో స్పందించారు. వర్షాల వల్ల రోడ్లు బ్లాక్ అయినప్పుడు గూగుల్ మ్యాప్స్ సైతం గందరగోళానికి గురై తప్పుడు సమాచారం ఇస్తుందని అందుకే తను ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ముందే బయలుదేరుతానని పేర్కొన్నారు. యాక్షన్ సినిమాల్లో తాను నేర్చుకున్న శిక్షణ ఇప్పుడు మోకాళ్ల లోతు నీటిలో నడవడానికి, ఆటోలను దాటుకుంటూ గొడుగు పట్టుకుని ప్రయాణించడానికి ఉపయోగపడుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. గాయని ఆకృతి కక్కర్ వర్షాకాలాన్ని తన బాల్కనీ నుండి ఆస్వాదించడానికి ఇష్టపడతానని, కానీ బయటకు వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నానని చెప్పారు.

ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్న సమయాన్ని వృధా చేయకుండా కారులోనే కొత్త ట్యూన్స్ .. సంగీతాన్ని కంపోజ్ చేయడానికి ఉపయోగిస్తానని తెలిపారు. ఇంధనం, సమయం , శక్తిని ఆదా చేసుకునేందుకు ఒకే ప్రాంతంలో ఉన్న పనులన్నింటినీ ఒకేసారి ముగించుకునేలా ప్లాన్ చేసుకుంటానని వివరించారు. సినీ, టెలివిజన్ ప్రముఖుడు దేవన్ భోజాని నగర ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు తోటి నటీనటులతో కలిసి కార్ పూలింగ్ పద్ధతిని పాటిస్తున్నట్లు తెలిపారు. పీక్ అవర్స్‌లో ప్రయాణించకుండా ప్రణాళికలు వేసుకుంటూ అత్యవసర పరిస్థితుల కోసం తన కారులో పెద్ద గొడుగు, పోర్టబుల్ ఛార్జర్, డ్రై ఫ్రూట్స్, అత్యవసర సంప్రదింపు నంబర్లను సిద్ధంగా ఉంచుకుంటానని పేర్కొ న్నారు.

నటుడు అభిషేక్ బెనర్జీ ముంబై వర్షాలతో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నగరంలో పౌరులు ఎలాగోలా తమ గమ్యస్థానాన్ని చేరుకుంటారని అయితే ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు నటుడు హితేన్ తేజ్వానీ మాట్లాడుతూ `ఈ ఏడాది నగరంలో నీటి కొరత ఉన్నందున వర్షాలు పడటం చాలా అవసరమని, ట్రాఫిక్ జామ్‌లు, జలమయమైన రోడ్లు ముంబైకర్ల జీవితంలో భాగమేనని, తాను ఈ వర్షాలను ప్రేమిస్తానని చెప్పుకొచ్చారు.

మొత్తంమీద ముంబై వర్షాలు నగర జీవనాన్ని ఎంతగా స్తంభింపజేసినప్పటికీ అక్కడి ప్రజల, సెలబ్రిటీల జీవనశైలి స్ఫూర్తి ఏమాత్రం తగ్గడం లేదని ఈ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఇబ్బందులను ఎదుర్కొంటూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడం ముంబై సంస్కృతిలో భాగమైంది. అయితే ప్రతి సంవత్సరం పునరావృతమయ్యే ఈ మౌలిక సదుపాయాల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికినప్పుడే రుతుపవనాల అందాలను సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు అందరూ సంపూర్ణంగా ఆస్వాదించగలరు.