60 కోట్ల స్కామ్: ఇద్దరు హీరోయిన్లు.. టీవీ చానెల్ అధినేత్రి!
కంపెనీలను ప్రారంభించిన సదరు బిజినెస్‌మేన్ కం నటుడు ఆ తర్వాత ఆ డబ్బును తన వారికి, తన సన్నిహితులకు బదిలీ చేసిన విధానంపై ఇప్పుడు ఆరాలు కొనసాగుతున్నాయి.
By: Sivaji Kontham | 18 Sept 2025 9:59 AM ISTఇటీవల నటుడిగా మారిన ప్రముఖ బిజినెస్‌మేన్ రకరకాల వ్యాపారాల పేరుతో ఇన్వెస్టర్ల నుంచి డబ్బును సమీకరించి పెద్ద మోసానికి తెర తీసిన కేసులో ముంబై ప్రత్యేక నేరవిభాగం పోలీస్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఐదు కంపెనీలను ప్రారంభించి భారీ లాభాలార్జించేందుకు అవకాశం ఉందంటూ పెట్టుబడుల్ని సమీకరించారు. పెట్టుబడిదారుల నుంచి అప్పు తీసుకున్నామనే గ్యారెంటీ ఇచ్చి, పెట్టుబడులపై భారీ లాభాలొస్తాయని నమ్మబలికారు. కానీ ఈ డబ్బును దుర్వినియోగం చేయడం, ప్రశ్నించినప్పుడు జవాబుదారీ తనం లేకపోవడంతో దానిని అనుమానించిన ఒక పెట్టుబడిదారుడు ముంబై పోలీసులను ఆశ్రయించాక షాకిచ్చే విషయాలు విచారణలో బయటపడుతున్నాయి.
కంపెనీలను ప్రారంభించిన సదరు బిజినెస్‌మేన్ కం నటుడు ఆ తర్వాత ఆ డబ్బును తన వారికి, తన సన్నిహితులకు బదిలీ చేసిన విధానంపై ఇప్పుడు ఆరాలు కొనసాగుతున్నాయి. ఆసక్తికరంగా ఈ స్కామ్ లో అతడు 3.15 కోట్లను ఇద్దరు ప్రముఖ కథానాయికలకు బదిలీ చేసినట్టు అతడు అంగీకరించాడని తెలిసింది. అంతేకాదు పాపులర్ టెలివిజన్ చానెల్ కు కూడా డబ్బును బదిలీ చేసినట్టు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు. ఈ లావాదేవీలేవీ సరిగా లేవని అనుమానిస్తున్నారు. అతడు పెట్టుబడిదారుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బును దారి మళ్లించాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తవ్వే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు.
సదరు బిజినెస్‌మేన్ ఒక టీవీ చానెల్ పేరుతో మీడియాలోను పెట్టుబడులు పెట్టాడు. కానీ సమీకరించిన డబ్బును అతడు పూర్తిగా దారి మళ్లించాడనేందుకు పోలీసులు అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. వివాదాస్పదుడు అయిన సదరు బిజినెస్ మేన్ కం నటుడు దీనిని లైట్ తీస్కున్నా కానీ, అతడి కారణంగా బయటపడిన ఇద్దరు హీరోయిన్లు, టీవీ చానెల్ అధినేత్రి కూడా ట్రబుల్స్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురిని విచారించేందుకు నేర విభాగ పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మునుముందు ఇంకా ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయో వేచి చూడాలి.
