Begin typing your search above and press return to search.

కోమా నుంచి బయటపడ్డాక నాలుగేళ్లు నరకం అనుభవించా!

కానీ కెరీర్ పీక్ లో టైమ్ లో ఆమె జీవితంలో చోటుచేసుకున్న ఒక ప్రమాదం అన్నింటినీ మార్చేసింది. బయటకు గ్లామర్, స్టార్‌డమ్ కనిపించినా.. ఆ వెలుగుల వెనుక ఎంత పెద్ద చీకటి దాగి ఉంటుందో ముమైత్ కథ మరోసారి గుర్తుచేస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   29 May 2026 8:00 PM IST
కోమా నుంచి బయటపడ్డాక నాలుగేళ్లు నరకం అనుభవించా!
X

ఒకప్పుడు టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ముమైత్ ఖాన్. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె స్పెష‌ల్ సాంగ్ ఉంటే చాలు థియేటర్లలో విజిల్స్ మోగేవి. ఇప్పటికింకా, ఓరోరి యోగి లాంటి సాంగ్స్ తో విప‌రీత‌మైన స్టార్‌డమ్ సంపాదించిన ముమైత్, తన డ్యాన్స్ ఎనర్జీతో టాలీవుడ్‌ను ఒక దశలో షేక్ చేసింది. కానీ కెరీర్ పీక్ లో టైమ్ లో ఆమె జీవితంలో చోటుచేసుకున్న ఒక ప్రమాదం అన్నింటినీ మార్చేసింది. బయటకు గ్లామర్, స్టార్‌డమ్ కనిపించినా.. ఆ వెలుగుల వెనుక ఎంత పెద్ద చీకటి దాగి ఉంటుందో ముమైత్ కథ మరోసారి గుర్తుచేస్తోంది.

కొన్నేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముమైత్ తన జీవితాన్ని తలకిందులు చేసిన సంఘటనను వివరించింది. మామూలుగా రోజూలానే అనుకుని స్నానం చేసి బయటకు వచ్చిన ఆమె, ఒక్కసారిగా బెడ్ మూలకు బలంగా తగిలి కిందపడిపోయిందట. మొదట అది చిన్న ప్రమాదమే అనుకుంది. కానీ ఆ ఒక్క దెబ్బ ఆమెను మరణం అంచుల వరకు తీసుకెళ్లింది. తలనొప్పి, అస్వస్థతను మైగ్రేన్‌గా భావించి పట్టించుకోలేదు. కానీ వాస్తవానికి ఆమె మెదడులో మూడు రోజుల పాటు బ్లీడింగ్ జరుగుతోందని తర్వాత తెలిసింది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వెంటనే ఐసీయూలో చేర్చిన వైద్యులు, ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని వెల్లడించారు.

15 రోజుల తర్వాత కళ్లు తెరిచిన ముమైత్‌కు అది ఒక్కరోజు నిద్రపోయినట్టే అనిపించిందట. త‌ర్వాత డాక్టర్లు 15 రోజులుగా కోమాలో ఉన్నావ‌ని చెప్పినప్పుడు తాను పూర్తిగా షాక్ అయ్యానని ఆమె తెలిపింది. ఆ రోజులు తన కుటుంబానికి నరకప్రాయంగా మారాయని ముమైత్ ఎమోష‌న‌ల్ అవుతూ చెప్పింది. ముఖ్యంగా తల్లి తన కోసం చేసిన ప్రార్థనలు, పడిన మానసిక వేదనను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఒత్తిడి కారణంగా త‌న తల్లి ఆరోగ్యం కూడా దెబ్బ‌తింద‌ని తెలిపింది. మరోవైపు తన తండ్రి జీవితంలో మొదటిసారి తన ముందే ఏడ్చారని చెప్పిన మాటలు మరింత ఎమోషనల్‌గా మారాయి.

కోమా నుంచి బయటపడిన తర్వాత అసలు పోరాటం అప్పుడే మొదలైందని ముమైత్ తెలిపింది. డాక్టర్లు ఏకంగా ఏడేళ్ల పాటు పని చేయవద్దని చెప్పడంతో కెరీర్ పూర్తిగా ఆగిపోయింది. అదే సమయంలో ఆమె సినిమాలకు దూరమవ్వడంతో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలు కూడా మిస్ అయ్యాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్, ఒక్కసారిగా తెరపై కనిపించకపోవడం వెనుక ఇంత పెద్ద వ్యక్తిగత విషాదం ఉందని చాలా మందికి అప్పటివరకు తెలియదు. మందుల ప్రభావంతో బరువు పెరగడం, సీజర్ అటాక్స్ రావడం, చిన్న వస్తువును కూడా ఎత్తలేని పరిస్థితి రావడం వంటి సమస్యలు ఆమెను తీవ్రంగా మానసికంగా కుంగ‌దీయ‌డంతో నాలుగేళ్ల పాటు నరకం అనుభవించాన‌ని ఆమె చెప్పిన మాటలు ఆ బాధ ఎంత తీవ్రమో తెలియజేస్తాయి.

అయితే ఆ కష్టకాలమే తనకు జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకునే అవకాశాన్ని ఇచ్చిందని ముమైత్ చెప్పడం విశేషం. దేవుడు త‌న‌కు రెండో జీవితాన్ని ఇచ్చాడంటూ ఆమె చెప్పిన మాటల్లో జీవితంపై కొత్త దృక్పథం కనిపిస్తుంది. స్టార్‌డమ్, గ్లామర్, హడావుడి మధ్య నిజమైన జీవితం ఏమిటో ఆ ఏడేళ్లలో తెలుసుకున్నానని ఆమె తెలిపింది. బయటకు కనిపించే సెలబ్రిటీ జీవితం ఎంత రంగులమయంగా ఉన్నా, వారి ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా తీవ్రమైన పోరాటాలు, కనిపించని కన్నీళ్లు ఉంటాయని ముమైత్ కథ మరోసారి గుర్తుచేస్తోంది.