మల్టీప్లెక్స్ రేట్లు ఇప్పటికైనా తగ్గుతాయా?
అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ రేట్లు కాస్త తగ్గే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
By: M Prashanth | 28 Aug 2025 11:19 AM ISTమల్టీప్లెక్స్ లో సినిమాలు చూడాలని సాధారణంగా అందరూ అనుకుంటారు. కానీ కొందరు మాత్రమే చూడగలరు! ఎందుకంటే మూవీ టికెట్స్ తో పాటు అక్కడ ధరలు సామాన్యులు భరించలేనంతగా ఉంటాయి. చాలా మంది వెళ్దామనుకున్నా.. వెళ్లి మూవీ చూడాలనుకున్నా.. ఖర్చు విషయంలో వెనకాడి మల్టీప్లెక్సులకు వెళ్లలేకపోతుంటారు.
అయితే ఇప్పుడు మల్టీప్లెక్స్ రేట్లు కాస్త తగ్గే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే స్వాత్రంత్య దినోత్సవం వేళ ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీలో మార్పులు ఉంటాయని ప్రకటించారు. ఆ తర్వాత జీఎస్టీ చట్టాన్ని సరళతరం చేసి.. పన్ను రేట్లు సవరించాలని కేంద్రం భావిస్తోందని తెలిపారు.
అదే సమయంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పన్ను ఉపశమనం కోసం పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచింది. టిక్కెట్లపై జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరించాలని మల్టీప్లెక్స్ నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 300 రూపాయల వరకు టికెట్ రేట్ పై జీఎస్టీ రేటును 5 శాతానికి తగ్గించాలని సూచిస్తూ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు.
అయితే తాము రూ. 100 స్లాబ్ ను రూ. 300కు పెంచాలని సిఫార్సు చేస్తున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కమల్ జియాన్ చందాని ఇటీవల తెలిపారు. రూ. 300 వరకు టికెట్ ధరలకు 5 శాతం జీఎస్టీ విధించాలని, రూ. 300 కంటే ఎక్కువ ఉన్న ధరలకు ఏదైనా 18 శాతం జీఎస్టీ వర్తించేలా చేయాలని కోరినట్లు తెలిపారు.
దీంతో ఇది అమల్లోకి వస్తే ఆడియన్స్ మాత్రం కాస్త ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు, మల్టీప్లెక్స్ సినిమా టికెట్ ధర రూ.295 అయితే హైదరాబాద్ ప్లెక్స్ లలో 5% జీఎస్టీ ఉంటే అది రూ.262.50 అవుతుంది. భారీ ఉపశమనం కాకపోయినా.. రేటు తగ్గితే కనుక మాత్రం మిడిల్ క్లాస్ ఆడియన్స్ కు అది ఊరట ఇచ్చే విషయమే.
అయితే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగితే అద్భుతమైన చర్య అనే చెప్పాలి. ఎందుకంటే ఇది థియేటర్లలో జన సమూహాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.100 కంటే ఎక్కువ ధర గల సినిమా టికెట్లకు 18 శాతం పన్ను విధిస్తుండగా.. రూ. 100 కంటే తక్కువ అయితే 12 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. మరి రేట్స్ ఎప్పుడు తగ్గుతాయో వేచి చూడాలి.
