Begin typing your search above and press return to search.

గ్లోబల్ సినిమాల్లో మల్టీ హీరోయిన్ల ట్రెండ్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఓ సరికొత్త దశలోకి అడుగుపెట్టింది. గతంలో అగ్రశ్రేణి హీరో సినిమా అంటే? ప్రధానంగా ఇకే హీరోయిన్ ఉండేవారు.

By:  Srikanth Kontham   |   15 July 2026 9:00 PM IST
గ్లోబల్ సినిమాల్లో మల్టీ హీరోయిన్ల ట్రెండ్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఓ సరికొత్త దశలోకి అడుగుపెట్టింది. గతంలో అగ్రశ్రేణి హీరో సినిమా అంటే? ప్రధానంగా ఇకే హీరోయిన్ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పద్ధతి పూర్తిగా మారుతోంది. పాన్-ఇండియా ప్రాజెక్టుల విస్తృతి పెరగడంతో మేకర్స్ భారీ చిత్రాల్లో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది స్టార్ హీరోయిన్లను తీసుకుంటూ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందిస్తున్నారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథా బలహీనతలను కవర్ చేయడానికి.. సినిమాకు గ్లోబల్ అప్పీల్ తీసుకురావడానికి సహాయపడుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `రాకా` చిత్రం ఈ ట్రెండ్‌కు నిదర్శనం.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పదుకోణే, రష్మికా మందన్న, మృణాల్ ఠాకూర్ , జాన్వీ కపూర్ వంటి స్టార్ నటీమణులు నటిస్తున్నారు. ఒక్కో నటికీ తనదైన మార్కెట్ , క్రేజ్ ఉండటంతో అంతా ఒకే తెరపై కనిపించడం అనేది అంచ‌నాలు అంత‌కంత‌కు పెంచేస్తుంది. కన్నడ స్టార్ యష్ న‌టిస్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `టాక్సిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా , రుక్మిణి వసంత్ వంటి ప్రముఖ నటీమణుల తారాగణం ఉంది. వీరంతా అతిథి పాత్రల్లా కాకుండా కథలో ప్రతి ఒక్కరికి కీలకమైన పాత్రలను కేటాయించడం తో చిత్రంపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది.

లేడీస్ అండ్ లేడీస్ టీజర్ ద్వారా మేకర్స్ ఈ నటీమణుల పవర్‌ఫుల్ అవతార్‌లను పరిచయం చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విధమైన మల్టీ-హీరోయిన్ల విధానం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం మార్కెటింగ్ వ్యూహం. వివిధ ప్రాంతాలకు చెందిన నటీమణులను తీసుకోవడం ద్వారా ఆయా భాషల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సులభమవుతుంది. ఉదాహరణకు ఒక సినిమాలో సౌత్ -నార్త్ ఇండస్ట్రీలకు చెందిన టాప్ హీరోయిన్లు ఉండటం వల్ల ఆ సినిమా ప్రమోషన్లు దేశవ్యాప్తంగా సమాన స్థాయిలో జరుగుతాయి. ఇది చిత్ర నిర్మాతల పెట్టుబడికి భద్రతను కల్పిస్తుంది.

ప్ర‌స్తుతం ప్రేక్షకులు కూడా కేవలం హీరోని మాత్రమే చూడటం లేదు. బలమైన హీరోయిన్ పాత్రలు .. గ్లామర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌లను ఆశిస్తున్నారు. హీరోయిన్ల సంఖ్య పెరగడం వల్ల సినిమాలో ఎమోషనల్ డ్రామా ..యాక్షన్ సన్ని వేశాలు మరింత వైవిధ్యంగా మారుతున్నాయి. అలాగే గ్లోబల్ మార్కెట్‌లో భారతీయ సినిమాల గుర్తింపు కోసం ఇలాంటి పెద్ద స్టార్ కాస్టింగ్ కీలకంగా మారుతోంది. చివ‌రిగా ఒకప్పుడు గ్లామర్ బొమ్మలుగా మిగిలిపోయిన హీరోయిన్లు ఇప్పుడు కథను ముందుకు నడిపించే శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇలాంటి మల్టీ-హీరోయిన్ల ట్రెండ్ భవిష్యత్తులో భారతీయ సినిమాలను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడానికి ఒక మెట్టుగా నిలుస్తుందని చెప్పొచ్చు. మ‌రి భారీ బడ్జెట్ .. తారాగణం ఉన్న తాజా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో ? చూడాలి.