Begin typing your search above and press return to search.

'రామాయ‌ణం' టీజ‌ర్ నెగెటివిటీపై కాస్టింగ్ ఏజెంట్ ఆవేద‌న‌!

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఒక ప్రధాన సవాలుగా మారింది.

By:  Sivaji Kontham   |   29 April 2026 4:00 AM IST
రామాయ‌ణం టీజ‌ర్ నెగెటివిటీపై కాస్టింగ్ ఏజెంట్ ఆవేద‌న‌!
X

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ఒక ప్రధాన సవాలుగా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమా విడుద‌ల‌వుతోంది అంటే దానిపైనే అంద‌రి దృష్టి ఉంటుంది గ‌నుక ఆ మేర‌కు రంధ్రాన్వేష‌ణ మేక‌ర్స్‌కు స‌మ‌స్య‌ల్ని కొని తెస్తోంది. ఇటీవ‌ల ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాలైన‌ రామాయణ, ధురంధర్ చుట్టూ జరుగుతున్న నెగెటివిటీపై ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛబ్రా తీవ్రంగా స్పందించారు. ఈ రోజుల్లో ఒక సినిమా ఎలా ఉంటుందో చూడకముందే.. కేవలం ఒక చిన్న టీజర్ లేదా గ్లింప్స్ ఆధారంగా ప్రజలు అతిగా విమర్శించడం విచారకరమని చాబ్రా అన్నారు. ఎవరైనా ఎవరి గురించి అయినా ఏమైనా మాట్లాడే పరిస్థితి నేడు ఉందని.. ఇది చూస్తుంటే తనకు బాధగా.. భయంగా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రణవీర్ సింగ్ - ఆదిత్యా ధర్ కాంబినేషన్‌లో వచ్చిన `ధురంధర్` ఫ్రాంచైజీ ఎదుర్కొన్న విమర్శలను ముఖేష్ ఛబ్రా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సినిమాను ఒక రాజకీయ ప్రొపగండా చిత్రమని.. ఒక వర్గానికి వ్యతిరేకంగా తీశారని సోషల్ మీడియాలో భారీస్థాయిలో నెగెటివిటీని ప్రచారం చేశారు. అయినా ఆ విమర్శలన్నింటినీ పటాపంచలు చేస్తూ ధురంధర్, ధురంధర్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.3000 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించాయి. కంటెంట్ బాగున్న సినిమాను ఏ శక్తులు ఆపలేవని ఈ విజయం నిరూపించిందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పుడు ఇదే తరహా నెగెటివిటీ నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న `రామాయణ` చిత్రంపై కూడా కనిపిస్తోంది. ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి వీఎఫ్ఎక్స్ నాణ్యత సరిగ్గా లేదని, రాక్షసుల పాత్రల చిత్రణ బాలేదని విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వలేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఈ పరిణామాలను గమనిస్తున్న ముఖేష్ ఛబ్రా సినిమా పూర్తిస్థాయిలో రాకముందే ఇటువంటి నిర్ణయాలకు రావడం సరికాదని హితవు పలికారు.

ట్రోలింగ్ చేసేవారి తీరును విశ్లేషిస్తూ.. వీరంతా కేవలం సినిమా విడుదలయ్యే వరకు మాత్రమే హడావిడి చేస్తారని ఛాబ్రా ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్లలోకి వచ్చి హిట్ టాక్ తెచ్చుకోగానే ఈ ట్రోలర్స్ అందరూ మాయమైపోతారని అన్నారు. సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు చేసే వారి శాతం చాలా తక్కువని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు ఇచ్చే ప్రేమ ఆ నెగెటివిటీని మించిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేవలం విమర్శల కోసమే చేసే ప్రచారాన్ని పట్టించుకోకూడదని ఆయన చిత్ర యూనిట్‌కు సూచించారు.

ప్రేక్షకులు చాలా తెలివైనవారు.. వారు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని ముఖేష్ ఛబ్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ధురంధర్ సినిమాకు ఎదురైన అనుభవమే రామాయణ విషయంలోనూ పునరావృతమవుతుందని.. సినిమా విడుదలైన తర్వాత అసలైన విజయం ఏమిటో అందరికీ తెలుస్తుందని ఛాబ్రా నొక్కి చెప్పారు. ఎంతటి భారీ నెగెటివిటీ ఉన్నా.. అంకితభావంతో తీసిన చిత్రాలకు ప్రేక్షకుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తన విశ్లేషించారు. దురంధ‌ర్, రామాయ‌ణ చిత్రాల‌కు ముఖేష్ చాబ్రా న‌టీన‌టుల‌ను ఎంపిక చేసారు. ఇండ‌స్ట్రీలో 30 ఏళ్ల అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ కాస్టింగ్ డైరెక్ట‌ర్ గా ఛాబ్రాకు పాపులారిటీ ఉంది.