శంకర్ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్..హీరో ఎవరు?
ఈ సినిమా విడుదలై ఇరవై ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికొచ్చింది.
By: Tupaki Entertainment Desk | 4 Jan 2026 8:00 AM ISTబ్లాక్ బస్టర్ మూవీస్‌కి సీక్వెల్స్ రూపొందుతున్న నేపథ్యంలో శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1999లో యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ముదలవన్`. మనీషా కోయిరాలా హీరోయిన్‌గా, రఘువరన్ ప్రధాన విలన్ గా చేసిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుఉలోనూ సంచలనం సృష్టించింది. దీన్ని తెలుగులో `ఒకే ఒక్కడు`గా విడుదల చేసి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు శంకర్.
ఆ తరువాత ఇదే మూవీని 2001లో అనిల్ కపూర్, అమ్రిష్‌పురీల కాంబినేషన్‌లో రీమేక్ చేశారు. ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేయగా శంకర్ రీమేక్‌కు దర్శకత్వం వహించారు. రాణీ ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఉత్తరాదిలో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలై ఇరవై ఐదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటికొచ్చింది. అప్పట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా పొలిటికల్ యాక్షన్ చిత్రాల్లో కల్ట్ క్లాసిక్ మూవీ అనిపించుకుంది.
దీంతో ఈ మూవీ సీక్వెల్ రైట్స్‌ని అనిల్ కపూర్ తీసుకున్నారట. అనురాగ్ కశ్యప్ డైలాగ్స్ అందించిన ఈ మూవీ ఔట్‌రేట్ రైట్స్‌ని `సనమ్ తేరే కసమ్` ప్రొడ్యూసర్ దీపక్ ముకుట్ తీసుకున్నారట. ఆయన నుంచి అనీల్ కపూర్ దక్కించుకున్నారని, త్వరలోనే దీనికి సీక్వెల్‌ని చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమా విడుదలై 25 ఏళ్ల కావస్తున్నా దానికి సీక్వెల్‌ని తీసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని, అందుకే దీని రైట్స్‌ని అనిల్ కపూర్ తీసుకున్నారని ఇన్ సైడ్ టాక్.
అయితే `నాయక్` సీక్వెల్‌ని ఇప్పుడు ఎవరితో తీస్తారు? ఏ హీరోతో తీయాలనుకుంటున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నేటి సమకాలీన రాజకీయాల నేపథ్యంలో సీక్వెల్‌కు అవకాశం ఉండటంతో ఈ సినిమాని ఇప్పుడున్న హీరోల్లో అనిల్ కపూర్ ఎవరితో ప్లాన్ చేస్తారు? తను ప్రొడ్యూస్ చేస్తాడా? ..లేక మరో నిర్మాతతో కలిసి నిర్మిస్తారా? ఇందులో ఉన్న నిజమెంత అన్నది తెలియాలంటే అనిల్ కపూర్ ఈ సీక్వెల్‌పై స్పందించే వరకు వేచి చూడాల్సిందే. అనిల్‌కపూర్ ప్రస్తుతం యష్‌రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న `ఆల్ఫా`, షారుక్ ఖాన్ `కింగ్` చిత్రాల్లో నటిస్తున్నాడు.
