Begin typing your search above and press return to search.

MS సుబ్బుల‌క్ష్మి పాత్ర‌కు ర‌ష్మిక స‌రిపోదా?

ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

By:  Sivaji Kontham   |   18 Sept 2026 7:44 AM IST
MS సుబ్బుల‌క్ష్మి పాత్ర‌కు ర‌ష్మిక స‌రిపోదా?
X

భారతీయ సంగీత దిగ్గజం, భారతరత్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, నెట్టింటనూ హాట్ టాపిక్‌గా మారింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ - రాక్‌లైన్ వెంకటేష్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ర‌క‌ర‌కాల‌ చర్చలకు దారితీసింది. ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై ప్రేక్షకులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు.

ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో రష్మిక మందన్న ఎంపికపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి లాంటి మహోన్నత సాంస్కృతిక ప్రతీక అయిన లెజెండ‌రీ పాత్రకు రష్మిక హావభావాలు, మోడ్ర‌న్ అప్పియ‌రెన్స్ శైలి సరిపోవని కొందరు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సంస్కృతం, తమిళ ఉచ్ఛారణలో ర‌ష్మిక‌ ఇబ్బంది పడవచ్చని.. నిత్యా మీనన్, కీర్తి సురేష్ లేదా విద్యా బాలన్ లాంటి నటీమణులైతే ఈ పాత్రకు మరింత సహజ న‌ట‌న‌తో న్యాయం చేయగలరని అభిప్రాయపడ్డారు. అయితే మరోవైపు ఇంతటి భారీ బయోపిక్‌కు పాన్-ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టగల స్టార్‌డమ్ కూడా అవసరమని.. గౌతమ్ తిన్ననూరి మేకింగ్ పై నమ్మకం ఉంచాలని కొందరు ఈ ఎంపికను సమర్థిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ ఎంపికపై కూడా భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అనిరుధ్ ఎక్కువగా కమర్షియల్, మాస్ .. హై-టెంపో ట్యూన్స్‌తో దూసుకుపోతుంటారని... అలాంటి వ్య‌క్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత ప్రాధాన్యత ఉన్న ఈ బయోపిక్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేశారు. అయితే, జెర్సీ, 3 వంటి చిత్రాలకు అత‌డు అందించిన సున్నితమైన, భావోద్వేగభరితమైన మెలోడీలను గుర్తుచేస్తూ.. దర్శకుడు సరైన స్వేచ్ఛ ఇస్తే అనిరుధ్ ఈ చిత్రంలో అద్భుతాలు చేయగలరని ఆయనను నమ్మే వర్గం బలంగా వాదిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ చెన్నైలోని ప్రతిష్టాత్మక మ్యూజిక్ అకాడమీలో విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కాగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. గౌతమ్ తిన్ననూరి ప్రతిభపై నమ్మకంతో పాటు.. గతంలో `మహానటి` లాంటి ప్రయోగాత్మక చిత్రాల విషయంలోనూ మొదట్లో ఇలాగే సందేహాలు వ్యక్తమైనా ఆ తర్వాత అథ్భుత విజయం సాధించాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. ఈ కాంబినేషన్ పై ప్రారంభమైన చర్చలు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయనే చెప్పాలి. రష్మిక మందన్న తన నటనతో ఈ సవాల్‌ను ఎదుర్కొని.. అనిరుధ్ తన సంగీతంతో ఈ మ్యూజికల్ లెజెండ్ కథకు ప్రాణం పోయగలరని ఆశిద్దాం. మరి ఈ ప్రాజెక్ట్ ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.