Begin typing your search above and press return to search.

దిగ్గజ నిర్మాతల 45 ఏళ్ల అరుదైన స్నేహం: MS రాజు విజన్‌పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రియులకు ఎమ్.ఎస్. రాజు అందించిన బ్లాక్‌బస్టర్ విజయాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

By:  Sivaji Kontham   |   11 Aug 2026 3:16 PM IST
దిగ్గజ నిర్మాతల 45 ఏళ్ల అరుదైన స్నేహం: MS రాజు విజన్‌పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతల మధ్య పోటీ సాధారణమే అయినా.. దశాబ్దాల తరబడి నిలిచే ప్రాణస్నేహాలు ఎంతో అరుదుగా కనిపిస్తుంటాయి. అటువంటి దిగ్గజ నిర్మాతల అరుదైన స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచారు ఎమ్.ఎస్. రాజు (హనీ) - శ్యామ్ ప్రసాద్ రెడ్డి. `అగ‌ధ` చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి త‌న స్నేహితుడు ఎంఎస్ రాజు గురించి ప్ర‌స్థావిస్తూ.. తమ మధ్య ఉన్న 40 నుండి 45 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు.

ఇద్దరం పరిశ్రమలోని రెండవ తరం నిర్మాతులమని.. 1985-86 ప్రాంతం నుండి కలిసి ప్రయాణిస్తూ ఒకరినొకరు ఎంతగానో ప్రభావితం చేసుకున్నామని తెలిపారు. ఎమ్.ఎస్. రాజు ప్రయాణాన్ని అత్యంత సమీపం నుండి పరిశీలించిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆయనలోని `మాస్టర్ స్టోరీ టెల్లర్`ను విప‌రీతంగా కొనియాడారు. మొదట్లో ఒక సాధారణ నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన ఎమ్.ఎస్. రాజు కాలక్రమేణా సినిమా నిర్మాణంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారన్నారు. కథా రచన, స్క్రీన్ ప్లే, సంగీతం, నటీనటుల పనితీరు, ప్రమోషన్స్ వరకు ప్రతీ విషయంలోనూ నైపుణ్యం సాధించి చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సెట్ చేశారని.. ఒక ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్‌గా ఎదిగారని ప్రశంసించారు.

తెలుగు సినీ ప్రియులకు ఎమ్.ఎస్. రాజు అందించిన బ్లాక్‌బస్టర్ విజయాలను శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటా సంక్రాంతి పండుగ బరిలో దిగి వరుసగా భారీ విజయాభయాలను సొంతం చేసుకుంటూ ఆయన `సంక్రాంతి రాజు`గా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. ముఖ్యంగా ప్రేమకథలు, మానవీయ భావోద్వేగాలను తెరకెక్కించడంలో ఎమ్.ఎస్. రాజుకు తిరుగులేని పట్టు ఉందని.. ఆయన ఏ శైలిలో సినిమా తీసినా హ్యూమన్ ఎమోషన్స్ ప్రధాన బలంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.

ఎమ్.ఎస్. రాజు నిర్మించిన కొత్త చిత్రం `అగ‌ధ` ట్రైలర్‌పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. నాగార్జున విజువల్స్, రాజేష్ సంగీతం, జునైద్ ఎడిటింగ్ అద్భుతమైన అనుభూతిని ఇచ్చాయన్నారు. ఎమ్.ఎస్. రాజు అంటేనే కథపై పట్టు ఉన్న వ్యక్తి అని.. ఇది కేవలం థ్రిల్స్ ఇచ్చే సాధారణ హారర్ సినిమా మాత్రమే కాదని.. దీని వెనుక బలమైన భావోద్వేగాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ థియేటర్లలో బిగ్ స్క్రీన్‌పైనే చూసి అనుభవించాలని ఆయన సూచించారు.

ఈ వేడుకలో `అగ`ధ` చిత్ర కథానాయిక కమాక్షి భాస్కర్ల నటనను ప్రశంసిస్తూ తమ క్లాసిక్ హిట్ `అరుంధతి` చిత్రంతో పోల్చడం విశేషం. అరుంధతి సమయంలో అనుష్కను చూసినప్పుడు ఎలాంటి రాయల్ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ అనిపించాయో చాలా కాలం తర్వాత కమాక్షిలో కూడా అలాంటి గాంభీర్యం, సినిమాను తన భుజాలపై మోయగల సామర్థ్యం కనిపిస్తున్నాయని కొనియాడారు. చిత్ర యూనిట్‌కి తన హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ మిత్రుడు ఎమ్.ఎస్. రాజు మరో పెద్ద విజయాన్ని అందుకోవాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.