ట్రెండును క్యాష్ చేసుకునే పనిలో పడ్డ నిర్మాత
ఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు సంక్రాంతి రాజు. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ హిట్స్ అందించిన నిర్మాతగా ఆయనకు తిరుగులేని ఇమేజ్ ఉండేది.
By: M Prashanth | 17 April 2026 10:58 AM ISTఎంఎస్ రాజు అంటే ఒకప్పుడు సంక్రాంతి రాజు. ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి క్లాసిక్ హిట్స్ అందించిన నిర్మాతగా ఆయనకు తిరుగులేని ఇమేజ్ ఉండేది. అయితే కాలక్రమేణా నిర్మాతగా ఫ్లాప్ లు రావడంతో ట్రెండ్‌కు అనుగుణంగా ఆయన తన రూటు మార్చి మెగాఫోన్ పట్టారు. ప్రస్తుతం ఏ టాపిక్ ట్రెండింగ్‌లో ఉంటే, దాన్ని బేస్ చేసుకొని సినిమాలు తీయడంలో రాజు గారు చాలా స్పీడ్ చూపిస్తున్నారు.
లేటెస్ట్ గా ‘అగధ’ అనే మిస్టరీ హారర్ ఫాంటసీ మూవీ పోస్టర్‌తో ఫోకస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఎస్ రాజు దర్శకుడిగా మారిన తరువాత ఎప్పటికప్పుడు ఆడియన్స్ పల్స్‌ను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ తీసుకొచ్చిన బోల్డ్ ఎరాలో ‘డర్టీ హరి’ అంటూ యూత్‌ను టార్గెట్ చేశారు. ఆ తర్వాత ‘7 డేస్ 6 నైట్స్’తో అదే రొమాంటిక్ ఫ్లేవర్‌ను కంటిన్యూ చేశారు. ఇక నరేష్ పవిత్ర లోకేష్ పేర్లు హాట్ టాపిక్‌గా ఉన్న సమయంలో ‘మళ్ళీ పెళ్లి’ అంటూ ఆ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియాలో ఈ సినిమాల హడావుడి గట్టిగానే ఉన్నా, బాక్సాఫీస్ వద్ద మాత్రం అవి ఆశించిన స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. కానీ ఏదో ఒక రకంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానో కొంత లాభం లేకపోలేదు. అందుకే ట్రేండింగ్ కంటెంట్ తో తెలివిగా బిజినెస్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఈమధ్య బాక్సాఫీస్ వద్ద కాంతార, విరూపాక్ష, మంగళవారం వంటి మిస్టికల్ హారర్ సినిమాల హవా నడుస్తోంది.
గ్రామీణ నేపథ్యం, దైవత్వం, క్షుద్ర శక్తుల చుట్టూ తిరిగే కథలకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ‘ట్రెండ్’ను ఒడిసిపట్టే క్రమంలోనే ఎంఎస్ రాజు ఇప్పుడు ‘అగధ’ను తెరపైకి తెచ్చారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే చాలా ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఒక భయంకరమైన విగ్రహం ముందు నిలబడిన యువతి, చుట్టూ భయపెట్టే వాతావరణం.. ఇవన్నీ చూస్తుంటే ఇది పక్కా హారర్ ఫాంటసీ అని అర్థమవుతోంది.
నిర్మాతగా దేవి, దేవిపుత్రుడు వంటి భారీ విజువల్ వండర్స్ నిర్మించిన అనుభవం ఎంఎస్ రాజుకు పుష్కలంగా ఉంది. అయితే ఇప్పుడు దర్శకుడిగా ఆయన అదే జోనర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరమే. ఈ ట్రెండ్ కథలకు ఓటీటీ డీల్స్ లాభంగానే ఉంటాయి. ప్రమోషన్ కంటెంట్ క్లిక్కయితే క్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే, కేవలం ట్రెండ్‌ను ఫాలో అవ్వడమే కాకుండా, ‘అగధ’లో బలమైన కంటెంట్ ఉంటేనే బాక్సాఫీస్ వద్ద ఫలితం ఉంటుంది. మరి గత చిత్రాల్లో మిస్ అయిన ఆ సాలిడ్ ఇంపాక్ట్ ఈ మిస్టరీ థ్రిల్లర్‌తో అయినా దక్కుతుందో లేదో చూడాలి.
