సిగరెట్ కాల్చకపోయినా ధోనీకి చీవాట్లు
నిజానికి ఆ కార్ లో వెనక సీట్‌లో సిగరెట్ ప్యాకెట్ కనిపిస్తోంది. అక్కడ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని, ఇతర బంధువు ఒకరు కూచుని ఉండగా, ధోని ముందు సీట్‌లో కూచుని ఉన్నాడు.
By: Sivaji Kontham | 30 Dec 2025 12:00 AM ISTఇష్యూ చేయాలనుకుంటే, ప్రతిదీ ఇష్యూనే. అవసరం లేదు అనుకుంటే, ఏదీ ఇష్యూ కాదు. ఇక్కడ నెటిజనులు ఇష్యూ చేయాలనుకున్నారో ఏమో కానీ ఎం.ఎస్.ధోనీ అలాంటి తప్పు చేసాడు! అంటూ సోషల్ మీడియాల్లో రభస మొదలైంది. అతడు సిగరెట్ నోట్లో పెట్టుకుని ఊదకపోయినా, కనీసం సిగరెట్ పై అటెన్షన్ చూపించే స్థితిలో లేకపోయినా కానీ, ఇప్పుడు అతడిని నెటిజనులు తప్పు పడుతూ, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి ఆ కార్ లో వెనక సీట్‌లో సిగరెట్ ప్యాకెట్ కనిపిస్తోంది. అక్కడ ఎంఎస్ ధోని భార్య సాక్షి ధోని, ఇతర బంధువు ఒకరు కూచుని ఉండగా, ధోని ముందు సీట్‌లో కూచుని ఉన్నాడు. పైగా సీట్ బెల్ట్ పెట్టుకుని పద్ధతిగా కార్ డ్రైవ్ చేయడంలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో అతడు సిగరెట్ తాగలేదు.. సిగరెట్ ప్యాకెట్ ని చేత్తో పట్టుకోలేదు..ఎలాంటి వ్యామోహం కనిపించలేదు. అయినా పెద్ద దుమారం చెలరేగింది. ఎంఎస్.ధోని , అతడి కుటుంబ సభ్యులు హానికరమైన అలవాటును ప్రోత్సహించారని విమర్శిస్తూ చాలామంది తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ధోనీ పేరును ప్రస్థావిస్తూ చాలా మంది అవమానకరంగా మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం ధోనీ కార్ లో వెళుతున్న ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. అయితే సోషల్ మీడియాల్లో ధోనీని విమర్శిస్తున్న వారికి కౌంటర్లు వేస్తూ ధోనీ ఫ్యాన్స్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితంపై ఎందుకు ఇంతగా తరచి చూస్తున్నారు? అని కామెంట్ చేసారు. ఇలాంటి విషయాలలో హద్దు మీరడం సరికాదని చాలా మంది సూచించారు. అతడు, అతడి కుటుంబం ఎలా జీవించాలో మీరు నిర్ధేశిస్తారా? అని కొందరు ప్రశ్నించారు. ఇలా అగౌరవంగా కామెంట్లు చేయడం సరికాదు.. ఒక సెలబ్రిటీని, అతడి కుటుంబ వ్యక్తిగత అలవాట్లను ప్రశ్నించే హక్కు మీకు లేదు. వ్యక్తులను వ్యక్తిగతంగా ట్రోల్ చేయొద్దని కొందరు సూచించారు.
ఎవరూ ఎవరినీ గుడ్డిగా అనుకరించరు. సెలబ్రిటీ జీవితంలోని ప్రతి అంశంలోనూ ప్రేరణ అంటే అనుకరణ కాదని మీరు అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణ విలువలు తెలిసినవాడు గనుకనే ధోని అంతర్జాతీయ క్రికెట్ లో ఆడాడు. అలాంటి వ్యక్తిని తూలనాడటం సరికాదని ప్రతివిమర్శలు చేసారు.
