Begin typing your search above and press return to search.

మృణాల్ కెరీర్ మలుపు తిరగనుందా?

టాలీవుడ్‌ లో ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడం చాలా అరుదు.

By:  M Prashanth   |   22 March 2026 4:58 PM IST
మృణాల్ కెరీర్ మలుపు తిరగనుందా?
X

టాలీవుడ్‌ లో ఒక్క సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించడం చాలా అరుదు. అలాంటి ఛాన్స్ ను అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు. సింపుల్ లుక్స్, నేచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌ గా మారింది. హిందీ టెలివిజన్ సీరియల్స్‌ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్, మొదట బాలీవుడ్‌ లో అవకాశాలు దక్కించుకున్నప్పటికీ, అక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే ఆమె అదృష్టం టాలీవుడ్ తలుపు తట్టిన తర్వాత కెరీర్ పూర్తిగా మారిపోయింది.

సీతారామం సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన చేసిన రోల్.. ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ మూవీ విజయాన్ని కొనసాగిస్తూ నానితో కలిసి చేసిన హాయ్ నాన్న కూడా రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ ను ఆకట్టుకునే కథలో మృణాల్ మరోసారి తన నటనతో మెప్పించారు. కానీ విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

కానీ ఇప్పుడు మృణాల్ ముందున్న టాలీవుడ్ ప్రాజెక్టులు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. అడివి శేష్ తో కలిసి నటిస్తున్న డెకాయిట్ మూవీ.. యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఆ సినిమాలో ఆమె పాత్ర ఇప్పటివరకు చూసిన మృణాల్‌ కు భిన్నంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం సక్సెస్ అయితే, ఆమెకు యాక్షన్ జానర్‌ లో కూడా అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

అదే సమయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో మృణాల్ నటిస్తున్నారని వార్తలు కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా, అది నిజమైతే ఆమె కెరీర్‌ లో మరో పెద్ద అవకాశంగా మారనుంది. అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోని స్పెషల్ సాంగ్‌ లో మృణాల్ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

ఆ పాటలో జాన్వీ కపూర్ కూడా భాగమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. భారీ సెట్స్, మాస్ బీట్‌ తో తెరకెక్కే ఆ పాట సినిమాకే హైలెట్ అవుతుందని సమాచారం. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ గా ఆ విషయాన్ని అనౌన్స్ చేయనున్నారట. అదే నిజమైతే మృణాల్ కు మరో పెద్ద ఛాన్స్ అని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. అలా వరుస అప్డేట్లను చూస్తుంటే మృణాల్ తన కెరీర్‌ ను కొత్త దిశలో తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

కేవలం నటనతోనే కాకుండా.. గ్లామర్, కమర్షియల్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మృణాల్ ఠాకూర్ కెరీర్ లో ముందుకు సాగుతున్నారని చెప్పాలి. ఏదేమైనా సరైన ప్రాజెక్టులు, స్టార్ కాంబినేషన్లలో చేస్తున్న సినిమాలు కలిసి వస్తే.. అదే భారీగా హిట్లు అయితే మృణాల్ ఠాకూర్ కెరీర్ మలుపు తిరిగే అవకాశం ఉందనే చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.