తక్కువ ఖర్చుతోనే అదిరిపోయే లుక్స్... మృణాల్ ప్లాన్ అదరహో!
రీసెంట్ గా ఫ్యాషన్, స్టైలింగ్ విషయంపై మాట్లాడిన మృణాల్ తక్కువ ఖర్చుతోనే తానెలా హై ఫ్యాషన్ లుక్స్ ను మెయిన్‌టెయిన్ చేస్తారో వెల్లడించారు.
By: Sravani Lakshmi Srungarapu | 17 Sept 2025 10:13 PM ISTదీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఉన్నట్టు ఏదైనా సంపాదిస్తున్నప్పుడే పొదుపు చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. అలా అని ఖర్చులు మానుకోవాలా అంటే కాదు, ఉన్నదాంట్లోనే అన్నింటినీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎంత డబ్బున్నోళ్లకైనా, పేద వాళ్లకైనా ఖర్చులుంటాయి. కాకపోతే వాటిని దేనికోసం ఖర్చు చేస్తున్నామనేదే పాయింట్.
సాధారణ మనుషుల్లానే సెలబ్రిటీలకు కూడా ఖర్చులుంటాయి. అయితే సెలబ్రిటీలు కాబట్టి వారికి అన్నీ ఉచితంగానే వస్తాయని అనుకోలేం. హీరోయిన్ అన్నప్పుడు ఎప్పటికప్పుడు ఫ్యాషన్ గా ఉంటూ, ఏదైనా ఈవెంట్ కు వెళ్తే రెడ్ కార్పెట్ పై అందంగా కనిపించాల్సిన అవసరం ఉంటుంది. అలా కనిపించడం కోసం వారు ఎంతో ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
సీరియల్ నటి నుంచి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా..
ఒకసారి వేసుకునే బట్టల కోసమే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ మృణాల్ మాత్రం తన రూటే సపరేట్ అంటున్నారు. సీరియల్ నటిగా ఇండిస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన మృణాల్ ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటించి, సీతారామం సినిమాతో టాలీవుడ్ కు సీతగా పరిచయమయ్యారు. ఆ తర్వాత నానితో చేసిన హాయ్ నాన్న సినిమా మృణాల్ కు మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఎలాంటి బట్టలైనా రూ. 2000కు మించి ఎక్కువ పెట్టను
రీసెంట్ గా ఫ్యాషన్, స్టైలింగ్ విషయంపై మాట్లాడిన మృణాల్ తక్కువ ఖర్చుతోనే తానెలా హై ఫ్యాషన్ లుక్స్ ను మెయిన్‌టెయిన్ చేస్తారో వెల్లడించారు. ఖరీదైన బట్టలు కొనడం తనకిష్టముండదని, పర్సనల్ గా తాను కొనే ఎలాంటి బట్టలైనా రూ.2000 కు మించి ఉండవని, ఒకవేళ బట్టల కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టినా వాటిని తాను ఒకటి, రెండు సార్లకు మించి వాడనని, అందుకే తాను ప్రమోషన్ల కోసం, ఈవెంట్ల కోసం లక్షల విలువైన బట్టలను కొనకుండా రెంట్ కు తీసుకుని తక్కువ ఖర్చుతోనే స్టైలిష్ గా కనిపించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
వరుస సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా మృణాల్ తన ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడాన్ని అందరూ మెచ్చుకోవడంతో పాటూ ఈ విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా బయటపెట్టినందుకు ఆశ్చర్యపోతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అడివి శేష్ తో డెకాయిట్ చేస్తున్న మృణాల్, అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.
