మొదటి నుంచే మృణాల్ కు ఆ సమస్య ఉందట!
టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి సినీ రంగంలోకి వచ్చిన భామ మృణాల్ ఠాకూర్ జర్నీ కూడా అలాంటిదే.
By: Madhu Reddy | 8 Feb 2026 5:00 PM ISTలైట్స్, కెమెరాలు, చప్పట్లు, ఎంతో మంది అభిమానులు.. సినీ సెలబ్రిటీ అంటే ఎవరికైనా మొదట ఇదే గుర్తొస్తుంది కానీ వాళ్లు ఆ స్థాయికి రావడానికి పడే కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొన్న సమస్యలు ఇవేవీ కనిపించవు. ఇండస్ట్రీకి రాకముందు, రీల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ లో ఒక్కొక్కరు ఒక్కో సమస్యను ఎదుర్కొని ఉంటే, కొంతమందికి తమలో తమకే ఒక సమస్య ఉంటుంది.
బుల్లితెర నటి నుంచి సినీ నటిగా..
టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి సినీ రంగంలోకి వచ్చిన భామ మృణాల్ ఠాకూర్ జర్నీ కూడా అలాంటిదే. ఆమె కెరీర్ జర్నీ చాలా ఇన్సిపిరేషన్ కూడా. అయితే మృణాల్ ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు ఎక్కువ క్రేజ్ ను తెచ్చిపెట్టింది మాత్రం సీతారామం సినిమానే. ఆ సినిమాలో సీతగా కనిపించి, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మృణాల్.
సీతారామంతో నెక్ట్స్ లెవెల్ క్రేజ్
సీతారామం తర్వాత మృణాల్ పలు సినిమాలు చేసి, వాటితోనూ మంచి ఫలితాల్ని అందుకున్నారు. అయితే సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న మృణాల్ లో మొదటి నుంచి ఓ సమస్య ఉండేదట. అదే ఆత్మవిశ్వాసం. తనకు ముందు నుంచి కూడా ఆత్మవిశ్వాసం తక్కువని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే తనకు ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆమె చెప్పారు.
ఫిబ్రవరి 20న దో దివానే సెహర్ మే రిలీజ్
ఈ విషయాన్ని స్వయంగా మృణాల్ ఠాకూరే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి మృణాల్ చేసిన దో దివానే సెహర్ మే అనే సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న మృణాల్ ఈ విషయాన్ని బయటపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చిన కొంత కాలం వరకు కూడా తనలో ఆత్మవిశ్వాసం చాలా తక్కువగా ఉండేదని చెప్పారు.
నమ్మకముండేది కాదట
ఏ పని మొదలుపెట్టి చేస్తున్నా తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త తక్కువగానే ఉండేదని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా తాను ఏ సినిమా ఒప్పుకున్నా, ఏ పాత్ర చేస్తున్నా దాంతో పాటూ తనను కొన్ని అనుమానాలు వెంటాడేవని, ఈ పాత్రకు నేను సరిపోతానా అనే ప్రశ్న తనకు మనసులో తరచూ మెదిలేదని, రీసెంట్ గా రిలీజైన సన్ ఆఫ్ సర్దార్2 మూవీ వరకు కూడా తాను అలానే ఫీలయ్యే దాన్నని ఆమె తెలిపారు.
కానీ ఇప్పుడు తనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిందని, కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ రావడానికి తనకు చాలా టైమ్ పట్టిందని, అప్పుడప్పుడు నన్ను నేను నమ్మడానికి ఇంత టైమ్ తీసుకున్నానని అనిపిస్తుందని ఆమె చెప్పారు. అయితే ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెంచుకున్న మృణాల్, దాని గురించి సరికొత్తగా చెప్తున్నారు. ఆత్మవిశ్వాసమంటే భయం లేకపోవడం కాదని, భయంతో కూడి ముందుకు సాగడం అని అంటున్నారు.
