ధనుష్‌తో డేటింగ్ పుకార్లు.. మృణాల్ సీరియస్!
టాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ నటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మృణాల్ ఠాకూర్. ఇటీవల తమిళంలోను మృణాల్ అవకాశాలు అందుకుంటోంది.
By: Sivaji Kontham | 6 Aug 2025 9:48 AM ISTటాలీవుడ్ బాలీవుడ్ లో బిజీ నటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మృణాల్ ఠాకూర్. ఇటీవల తమిళంలోను మృణాల్ అవకాశాలు అందుకుంటోంది. అదే సమయంలో స్టార్ హీరో ధనుష్ తో మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం సాగిస్తోందని ప్రచారం మొదలవ్వడం ఆశ్చర్యపరిచింది. అప్పటికే భార్య ఐశ్వర్య రజనీకాంత్‌కు విడాకులిచ్చిన ధనుష్ మృణాల్ తో అత్యంత సన్నిహితంగా మెలగడం, బర్త్ డే పార్టీలో మృణాల్ తో చీర్ చేయడం వంటి ఘటనలు మీడియా దృష్టిలో హైలైట్ అవ్వడంతో దీనిపై పెద్ద డిబేట్ కొనసాగుతోంది.
అయితే మృణాల్ నిజంగానే ధనుష్ తో ప్రేమాయణం సాగిస్తున్నారా? అన్నది ఇప్పటికి ఊహాగానం మాత్రమే. ఇప్పటివరకూ మృణాల్ కానీ, ధనుష్ కానీ దీనిని అధికారికంగా ఖరారు చేయలేదు. ఇదంతా ఇప్పటికి మీడియా ప్రచార హంగామా మాత్రమే. అయితే ఇటీవల తన సినిమా 'సన్ ఆఫ్ సర్ధార్ 2' సక్సెస్ ని ఆస్వాధిస్తున్న మృణాల్ ఓ మీడియా తో మాట్లాడుతూ దుష్ట కన్ను (ఈవిల్ ఐ) గురించి మాట్లాడారు. ఇది చెడు ప్రొపగండాను మోసుకొస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్టు వెల్లడించారు.
నా కెరీర్ లో నేను సాధించాల్సింది, చూడాల్సినది చాలా ఉంది. ఏదైనా ప్రాజెక్ట్ విషయంలో అధికారికంగా కన్ఫామ్ అయితే కానీ నేను దానిపై మాట్లాడను. కానీ మీడియాలో చాలా ముందే అనవసర ప్రచారం సాగిస్తారని కూడా మృణాల్ పేర్కొంది. నేను నిజంగా కమిటైతే అప్పుడు చెప్పాలి.. అనవసరంగా అపహాస్యం చేయకూడదు! అని మృణాల్ అన్నారు.
ప్రపంచానికి మీరు ఏం చెబుతున్నారో, ఎంత చెబుతారో మీకు మీరుగా నియంత్రించుకోవాలి! అని తనపై ప్రచారం సాగించే మీడియాలకు మృణాల్ చురకలు అంటించింది. ప్రాజెక్టులు అయినా వ్యక్తిగత విషయాలు అయినా అభిమానుల్లో కొన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటిని మించి ఏదో ఒకటి ప్రచారం చేయడం సరికాదని కూడా మృణాల్ సుతిమెత్తగా హెచ్చరించారు. ఏదో ఒకటి రాసేసే కంటే అధికారికంగా ప్రతిదీ ఖరారయ్యే వరకూ ఆగాలని కోరారు. తాను మాత్రం అనవసర హంగామాకు దూరంగా, మౌనంగా ఉండటానికి ఇష్టపడతానని మృణాల్ పేర్కొంది.
ఒకరు నా గురించి మాట్లాడే ముందు ఆలోచించాలి.. నా ప్రణాళికల గురించి మాట్లాడాలనే ఉత్సాహంలో అపహాస్యం చేయకూడదు! అని కూడా మృణాల్ సీరియస్ అయ్యారు. ఈ రెండు కోణాల్లో నేను భిన్నమైన వ్యక్తిని అని కూడా పేర్కొనడం విశేషం. నిరంతరం ఏవో వార్తలతో నాపై ఒత్తిడి పెంచలేరు. నేను వేటినీ పట్టించుకోను.. తలకెక్కించుకోను! అని మృణాల్ సూటిగా పేర్కొన్నారు. సానుకూల వ్యక్తిత్వం కారణంగా తాను ఒత్తిడికి లోనవ్వను అని మృణాల్ చెప్పారు.
ఇంతకుముందు మృణాల్ బర్త్ డే పార్టీలో కనిపించిన ధనుష్ .. 'సన్ ఆఫ్ సర్ధార్ 2' ప్రీమియర్ షోలో కూడా మృణాల్ తో కలిసి కనిపించడం పుకార్లకు ఆజ్యం పోసింది. ఆ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతానికి ఆ ఇద్దరూ ప్రతిదీ మీడియా గ్లేర్ కి దూరంగా, లో-ప్రొఫైల్ లో ఉంచాలని భావిస్తున్నారని కూడా కథనాలొచ్చాయి. కానీ ధనుష్ కానీ, మృణాల్ కానీ డేటింగ్ ని ధృవీకరించలేదు. ధనుష్ గతంలో ఐశ్వర్య రజనీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. రెండు దశాబ్దాలు కలిసి ఉన్న తర్వాత వారు 2024లో విడాకులు తీసుకున్నారు.
