ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న మృణాల్.. బుట్ట సర్దాల్సిందేనా?
హిందీ టీవీ సీరియల్ నటిగా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్.
By: Madhu Reddy | 6 Aug 2025 6:00 AM ISTహిందీ టీవీ సీరియల్ నటిగా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత నటిగా గుర్తింపు సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్. తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నేరుగా తెలుగులో నటించిన తొలి చిత్రం సీతారామం. ఈ సినిమాలో సీత పాత్రలో చాలా అద్భుతంగా ఒదిగిపోయి నటించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో మొదటి సినిమానే అయినా.. ఆ సినిమాలోని పాత్రతో తెలుగువారి హృదయాలను దోచుకుంది.పైగా తెలుగు ఆడియన్స్ ఈమెను ఓన్ చేసుకున్నారు. తర్వాత నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో కూడా నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా కథానాయికగా నటించింది కానీ ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. పైగా దాదాపు ఐదు సంవత్సరాల సినీ కెరియర్లో రెండు చిత్రాలు తప్ప మరో సినిమా ఈమెకు విజయాన్ని అందించలేదు. అటు కథానాయికగా ఎదిగిన బాలీవుడ్ లో కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. 2019లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న ఈమె.. ఆ తర్వాత ఒక్క సినిమాతో కూడా సక్సెస్ అందుకోలేకపోయింది.
సూపర్ 30 తరువాత బాలీవుడ్ లో తూఫాన్, బాట్లా హౌస్, జెర్సీ, సెల్ఫీ, గుమ్రా, ఆంఖ్ మిచోలి, పిప్పా ఇలా పలు చిత్రాలు చేసింది. కానీ వరుస పరాజయాలే పలకరించాయి. ఇక ఇప్పుడు సన్నాఫ్ సర్దార్ 2లో కూడా నటించింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బస్ పెద్దగా లేకపోవడం వల్ల ఓపెనింగ్స్ రాలేదు. టికెట్ పై 50% ఆఫర్ పెట్టినా కూడా తొలిరోజు థియేటర్లలో జనం కనిపించకపోవడం, పైగా డివైడ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. దాంతో వారంలోపే డిజాస్టర్ మూవీగా తేలిపోయింది ఈ సినిమా.
ప్రస్తుతం ఈమె ఆశలన్నీ అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాపైనే ఉన్నాయి. సాధారణంగా అడివి శేష్ సినిమాలు అంటే మంచి కంటెంట్ తో వస్తాయని అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆయన నుంచి వచ్చిన గూఢచారి , హిట్ 2 వంటి చిత్రాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొదట ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా ఎంపిక అయ్యి.. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేశారు. కాకపోతే శృతిహాసన్ వరుస సినిమాల బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ సినిమాకి డేట్ కేటాయించలేకపోయింది. ఫలితంగా సినిమా నుండీ తప్పుకుందని అడివి శేషు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇప్పుడు ఆ ఛాన్స్ మృణాల్ ఠాకూర్ కి వచ్చింది. మరి ఈ సినిమాతో నైనా కం బ్యాక్ ఇస్తుందా? ఒకవేళ ఈ సినిమా బెడిసి కొడితే ఇక బుట్ట సర్దాల్సిందేనా ? అనే అనుమానాలు కూడా ఫిలిం ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఈ ఒక్క సినిమాపై ఆశలు పెట్టుకున్న మృణాల్ కి ఎలాంటి ఫలితం లభిస్తుందో చూడాలి.
